వడ్డీ చెల్లింపులకు రూ.13వేల కోట్లు

23 Feb, 2019 04:12 IST|Sakshi

ఈ ఏడాదికన్నా రూ.1,200 కోట్లు అధికం

మళ్లీ ఈ ఏడాది 33వేల కోట్ల రుణాలకు వెళ్లే ప్రతిపాదన

ఇప్పటికే కేంద్రం నుంచి రూ.800 కోట్ల రుణ అడ్వాన్సులు  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది బడ్జెట్‌ అంచనాల్లో 7 శాతం మేర.. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు 2019–20 బడ్జెట్‌ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయపట్టికలో రూ.12,907.99 కోట్లు వడ్డీ చెల్లింపులకు ప్రతిపాదించారు. అన్ని వనరుల నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకుగాను ఈ మొత్తాన్ని చూపెట్టారు. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.1,200 కోట్లు అధికం కావడం గమనార్హం. 

అప్పుల కుప్ప: ఇక, వచ్చే ఏడాది కూడా పెద్దఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్‌ అంచనా లెక్కలు చెపుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ.33వేల కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం రూ.32,758 కోట్లుగా రాబడుల వివరణలో ప్రభుత్వం పేర్కొంది. దీనికి తోడు ఇప్పటికే కేంద్రం నుంచి అడ్వాన్సుగా రూ.800 కోట్లు తీసుకున్న మొత్తంతో కలిపి వచ్చే ఏడాది కొత్త రుణం రూ.33,558 కోట్లుగా చూపెట్టింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 32,400 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో సమీకరించగా, వచ్చే ఏడాది ప్రతిపాదిత రుణం గత ఏడాది కన్నా రూ.1,100 కోట్లు అధికంగా కనిపిస్తోంది. గృహనిర్మాణం కింద రూ.2,550 కోట్లు, పట్టణాభివృద్ధి కింద రూ.4,800 కోట్లు, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల పేరుతో రూ.400 కోట్లు కలిపి మరో 7,800 కోట్లను కూడా అప్పులుగా సమీకరించనుంది. దీంతో వచ్చే ఏడాది అప్పుల అంచనా లెక్క రూ.40వేల కోట్లు దాటుతుందని అంచనా. 

మరిన్ని వార్తలు