విడతలవారీ కరెంటే నయం!

17 Mar, 2017 01:01 IST|Sakshi
విడతలవారీ కరెంటే నయం!

నిరంతర విద్యుత్‌ వల్ల బావుల్లో నీరు అడుగంటుతోంది: తుమ్మల
విడతలవారీగా అంటే సీఎం కేసీఆర్‌ ఒప్పుకోరు: మంత్రి జగదీశ్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: ‘తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి మించి నీళ్లు ఇవ్వడం వల్ల పామాయిల్‌ తోటల దిగు బడి కూడా తగ్గుతోంది. అందుకే మా ప్రాంత రైతుల కోరిక మేరకు తొమ్మిది గంటలు కాకుండా రెండు, మూడు విడతల్లో కరెంటు ఇవ్వాలని కోరుతున్నా..’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ సీఎం ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ ఇవ్వాల్సిందే. ఒకవేళ రైతులు గట్టిగా డిమాండ్‌ చేస్తే.. ఒకే ఫీడర్‌ కింద ఉన్న రెండు, మూడు గ్రామాల రైతులు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ఇస్తే విడతలవారీగా సరఫరాకు ఆలోచన చేస్తాం’ అని పేర్కొన్నారు.

గురువారం అసెంబ్లీలోని మంత్రి ఈటల రాజేందర్‌ చాంబర్‌లో ఈ ఇద్దరు మంత్రుల మధ్య విద్యుత్‌ సరఫరాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ మంత్రులు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆటోమేటిక్‌ స్టార్టర్ల వల్ల మోటార్లు పూర్తిగా ఆన్‌లోనే ఉంటున్నాయని, దీంతో అవసరానికి మించి నీటిని తోడేస్తున్నాయని, ఫలితంగా భూగర్భ జలమట్టం పడిపోతోందని తుమ్మల అన్నారు. తెలంగాణలోని చాలాప్రాంతాల్లో నిరంతర కరెంటు వల్ల బావుల్లో నీరు అడుగంటిపోతోందని, తిరిగి ఊరడానికి సమయం పడుతోందని, విడతల వారీగా కరెంటు ఇస్తే రైతు లకు వెసులుబాటు ఉంటుందని తుమ్మల నాగేశ్వర్‌రావు విశ్లేషించారు. విడతలవారీగా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, అయినా, రైతులు చెబుతున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతామని  జగదీశ్‌రెడ్డి అన్నారు.

 కరెంటు కోత పెట్టాల్సిన పరిస్థితులు తెలంగాణలో లేవని చెప్పారు. 2004 మార్చి నాటికి ఇప్పటికీ కరెంటు డిమాండ్‌ పెరిగినా, ఎలాంటి సమస్య తలెత్తలేదని, ఇక, ఇప్పుడు ఏపీ కరెంటు కూడా అవసరం లేదని, ఇతర ప్రాంతాల కంటే ఏపీ కరెంటు ధర ఎక్కువని అన్నారు. ఇప్పటికీ పది గంటలపాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వగలు గుతామని, వచ్చే ఏడాదయితే ఇరవై నాలుగు గంటలూ పవర్‌ ఇవ్వొచ్చని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు