-

కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!

22 May, 2020 12:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ సరుకులను రెట్టింపు చేసింది. బియ్యంతో పాటు ఒక్కో కార్డుపై కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొంత మంది రేషన్‌ దారులకు వరంగా మారింది. నాసిరకమైన కందిపప్పును ప్రజలకు అంటగట్టి నాణ్యమైన కందిపప్పును బయట మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా రామంతపూర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాల్లో రెండు రకాల కందిపప్పును ప్రజలకు అంటగడుతున్నారు.


నాసిరకమైన కందిపప్పు

అయితే ఈ క్రమంలో ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ రేషన్‌ షాపులో నాసిరకమైన కందిపప్పును సరఫరా చేస్తుండటంపై ఓ వ్యక్తి ప్రశ్నించగా ఆ రేషన్‌ దుకాణదారుడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘ఇక్కడ నచ్చకుంటె అమరావతికి వెళ్లిపో’ అంటూ జవాబిచ్చాడు. దీంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. అయితే ప్రజలకు అందించే రేషన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడని విషయం తెలిసిందే. నాణ్యమైన సరుకులను ఇంటింటికి అందిస్తూ అక్కడి ప్రజల మన్ననలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఆ రేషన్‌ దుకాణదారుడు నచ్చకుంటే అమరావతి వెళ్లమని అన్నారని అక్కడి వారందరూ అనుకుంటున్నారు. ఇక నాసిరకం కందిపప్పుపై రేషన్‌ దుకాణదారుడిని మీడియా ప్రశ్నించగా ఇదంతా సివిల్‌ సప్లయి గోడౌన్‌లలో జరుగుతుందని తమకేమి సంబంధంలేదని అతడు పేర్కొన్నాడు.


నాణ్యతగల కంది పప్పు  

మరిన్ని వార్తలు