ముదురుతున్న ముసలం

17 Apr, 2014 04:12 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు రసవత్తరంగా మారుతోంది. రెబెల్ అభ్యర్థిని ఒక పార్టీ బరిలో ఉంచితే.. మరో పార్టీ శ్రేణులు తమను పట్టించుకోని వారిని తామెందుకు గౌరవిస్తామని వ్యాఖ్యానిస్తున్నాయి. వెరసి జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పొత్తు కత్తులు నూరుతోంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి చిలుముల శంకర్‌పై సీపీఐ రాష్ర్ట నేతలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్, సీపీఐల మధ్య కుదిరన పొత్తుతో బెల్లంపల్లి స్థానం నుంచి గుండా మల్లేశ్‌ను సీపీఐ బరిలోకి దింపింది. చిలుముల శంకర్ కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

ఆయనను ఉపసంహరింపచేయాలని సీపీఐ కాంగ్రెస్‌ను కోరినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఇటీవల గుండా మల్లేశ్ నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేసి సీపీఐ-కాంగ్రెస్  కార్యకర్తలు పొత్తు ధర్మం పాటించాలని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ ప్రయత్నం ఫలించినట్లుగా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని శంకర్‌కే తాము మద్దతిస్తామని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదంతా కాంగ్రెస్‌లోని ఓ బలమైన నాయకుడి అండతో సాగుతోందని సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

దీంతో గుండా మల్లేశ్ పరిస్థితి సంకటంలో పడిందని నియోజకవర్గ కమ్యూనిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ కాంగ్రెస్-సీపీఐ శ్రేణుల మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతల సమావేశాలు, ప్రచారంలో ఎక్కడా సీపీఐ వర్గాలు కానరావడం లేదు. బెల్లంపల్లిలో తమకు కాంగ్రెస్ సహకరించిడం లేదని అలాంటపుడు తాము వినోద్‌కు మద్దతుగా ఎలా ఉంటామని చెన్నూర్ సీపీఐ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ శ్రేణులను కాంగ్రెస్ ప్రచారంలో ఆహ్వానించడం లేదు.

 శంకర్‌పై ఫిర్యాదు
 శంకర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎన్నికల కమిటీ కన్వీనర్ చాడా వెంకటరెడ్డి తెలంగాణ పీసీసీ అగ్రనేతలకు బుధవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. నేడు(గురువారం)సమావేశం కానున్న టీపీసీసీ శంకర్‌ను సస్పెండ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తమ రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఉందా అనే సందేహాలు తమకే కలుగుతున్నాయని ఇరు పార్టీల నేతలే చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు