ఉప ఎన్నిక వచ్చేనా..?

19 Nov, 2017 08:08 IST|Sakshi

రేవంత్‌ ఇలాకాలో రసవత్తర రాజకీయం

మంత్రి హరీశ్‌రావు రంగప్రవేశం        

కోస్గి, మద్దూరుపైనే ప్రధాన గురి 

ఆపరేషన్‌ ‘కొడంగల్‌’లో భాగంగా అభివృద్ధిపై ఫోకస్‌ 

జిల్లా అధికారులతో హైదరాబాద్‌లో మంత్రుల సమీక్షలు 

రేవంత్‌ను నిలువరించడం అంత సులువుకాదని భావిస్తున్న టీఆర్‌ఎస్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి అడుగు పెట్టినప్పటినుంచి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేవంత్‌ను ఎదుర్కోవడానికి నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ‘కొడంగల్‌’లో భాగంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారించింది. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సైతం ఈ వ్యవహారంలో రంగ ప్రవేశం చేయడంతో రాజకీయం మరింత వేడెక్కింది.  

అభివృద్ధి మంత్రాంగం.. 
ఇప్పటివరకు నియోజకవర్గంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలక నాయకులను అధికారపార్టీ పెద్దలు గులాబీ గూట్లోకి లాగేశారు. అయితే ఇలాంటి చేరికలు ఎన్ని చేసినా కొడంగల్‌లో రేవంత్‌ను ఢీ కొట్టడం అంతా సులువైన పనికాదని రూటు మార్చారు. మంత్రి హరీశ్‌ సూచన మేరకు అభివృద్ధి మంత్రాంగాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని 5 మండలాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. అందుకు అనుగుణంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల్లోని  పెండింగ్‌ పనులు, చేపట్టాల్సిన కొత్త పనులపై కార్యాచరణ చేపట్టారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రతీశాఖకు చెందిన ఉన్నతాధికారులను హైదరాబాద్‌లోని సచివాలయానికి పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డిలు నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  

ఉప ఎన్నిక వచ్చేనా..? 
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో ప్రధానంగా కొడంగల్‌ ఉప ఎన్నిక మీదనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి టీడీపీ నుంచి ఎన్నిక కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామా లేఖను నేరుగా అసెంబ్లీ స్పీకర్‌కు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబుకు అందజేశారు. పార్టీ టికెట్టు ఇవ్వడంతోపాటు గెలుపునకు కృషి చేసినందుకు తన రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చినట్లు రేవంత్‌ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ రాజీనామా లేఖ స్పీకర్‌కు చేరకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. 

అలాగే పార్టీ  ఫిరాయింపుల అంశం కూడా తెరపైకి వస్తోంది. నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. అయితే రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారెవరు కూడా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. రేవంత్‌ రాజీనామా అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా వీరిద్దరి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. దీంతో అధికార పార్టీ కూడా రేవంత్‌ రాజీనామా విషయంలో గట్టిగా నిలదీయలేకపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొడంగల్‌ ఉప ఎన్నిక వస్తుందా.. రాదా.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 

రేవంత్‌ను నిలువరిస్తారా?  
కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని నిలువరించడం అంత సులువుకాదని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. ఆ నియోజకవర్గం నుంచి మొదటిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రేవంత్‌కు కేవలం 5వేల మెజార్టీ మాత్రమే ఉంది. అనంతరం నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటూ రేవంత్‌ జనంలో చెరగని ముద్ర వేసుకున్నారు. తన మాటల మంత్రాంగంతో ప్రజలను మంత్ర ముగ్దులను చేశారు. దీంతో 2014లోనూ  తెలంగాణ సెంటిమెంట్‌ అత్యంత బలంగా ఉన్నా.. టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా..  రేవంత్‌ 15వేల మెజార్టీతో గెలుపొందారు. కేవలం తన వ్యక్తిగత చరిష్మా వల్లే మెజార్టీని రెండు రెట్లు పెంచుకోగలిగారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి సమావేశం జరిగినా.. ‘కొడంగల్‌ నియోజకవర్గం’ ప్రతిష్ట పెంచానంటూ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు. ఇటీవల పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. వైఎస్‌ ఫ్యామిలీకి పులివెందుల ఎలాగో.. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలా ప్రజల మధ్య పెనవేసుకుపోయిన రేవంత్‌ను ఓడించడం కష్టతరమైందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందుకు ముందుగా రేవంత్‌ను బలహీనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో వేచిచూడాలి.  

మరిన్ని వార్తలు