ఐఆర్‌ ప్రకటన వాయిదా

2 Jun, 2018 02:13 IST|Sakshi

పీఆర్సీ నివేదిక రాకుండా ప్రకటిస్తే సమస్యలు వస్తాయన్న అధికారులు

మధ్యంతర నివేదిక వచ్చే వరకైనా ఆగాలని సూచన

ఏకీభవించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

 వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీ చైర్మన్‌కు చెప్పిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటన వాయిదా పడింది. తొలుత భావించిన విధంగా రాష్ట్రావతరణ దినం రోజున దీనిపై ప్రకటన చేయడం లేదని.. ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. వేతన సవరణ సంఘం నివేదిక రాకముందే ఐఆర్‌ ప్రకటిస్తే.. పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి ప్రకటన అంశంపై శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సమావేశం జరిగింది. ఇందులో పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్‌ అలీ రఫత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ఐఆర్‌ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘‘వేతన సవరణ కమిషన్‌ వేసి కొద్దిరోజులే అయింది. నివేదిక రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ నివేదిక రాకుండా ఐఆర్‌ ప్రకటిస్తే కమిషన్‌ను అగౌరవపర్చినట్టే అవుతుంది. పీఆర్సీ వేసిన తర్వాత నివేదిక రాకుండా ఐఆర్‌ ప్రకటిస్తే కాగ్‌ సైతం అభ్యంతర పెట్టవచ్చు. అందువల్ల నివేదిక వచ్చేదాకా ఆగితే మంచిది..’’అని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనీసం పీఆర్సీ మధ్యంతర నివేదిక అందేవరకైనా వేచిచూడడం మంచిదని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి కూడా ఐఆర్‌ ప్రకటన వాయిదాకే మొగ్గుచూపారు. 

భారంపైనా సమీక్ష.. 
ఐఆర్‌ ప్రకటన, చెల్లింపు అంశాలు, పడే భారం తదిత ర అంశాలను అధికారులు సీఎంకి వివరించారు. గతంలో ఉద్యోగుల వేతనాలు భారీగా పెంచిన కారణంగా ఇప్పుడు ఐఆర్‌ భారం కూడా భారీగానే ఉంటుందని పేర్కొన్నారు. ఒక శాతం ఐఆర్‌ ప్రకటిస్తే.. ఏడాదికి రూ.300 కోట్లు, పది శాతం ఇస్తే రూ.3 వేల కోట్లు, 20 శాతం ఇస్తే రూ.6 వేల కోట్లు అదనపు భారం పడుతుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

‘‘ప్రభుత్వం ఇప్పటిదాకా చక్కటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వస్తోంది. తద్వారా మంచి పేరు సంపాదించుకుంది. ఇలాంటి సమయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయకుండా ఐఆర్‌ ప్రకటిస్తే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది..’’ అని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. అధికారుల సూచనతో ఏకీభవించిన సీఎం.. ఐఆర్‌ ప్రకటనను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని పీఆర్సీ చైర్మన్‌ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్‌ అలీ రఫత్‌లకు చెప్పారు. అయితే పీఆర్సీ మరో సభ్యుడు ఉమామహేశ్వరరావు ఇంకా బాధ్యతలు చేపట్టలేదని, ఆయన చేరాక ప్రక్రియ మొదలవుతుందని బిస్వాల్‌ వివరించారు.

మరిన్ని వార్తలు