ఆటలిక సాగవు

25 May, 2018 08:14 IST|Sakshi
ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : 2018–19 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్‌ అడ్మిషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 21 నుంచి ప్రారంభమైంది.  ఇప్పటికే ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఇంటర్మీడియెట్‌లోనూ ఇదే పద్ధతికి శ్రీకారం చుట్టాలని సర్కారు భావించింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ సైతం రూపొందించి ఆయా జిల్లాల ఇంటర్మీడియట్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఆదేశాలు ఇచ్చింది.

పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. పదో తరగతి పరీక్షలు పూర్తికాక ముందే అడ్మిషన్ల కోసం ఎగబడే కొన్ని కళాశాలలకు మూకుతాడు వేసేందుకు ఇంటర్‌ అడ్మిషన్లను అన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ విధానం అమలైతే కార్పొరేట్‌ కళాశాలలతోపాటు ప్రైవేట్‌ కళాశాలలు వసూలు చేసే ఫీజులు అదుపు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మెరిట్‌ ఆధారంగానే సీట్ల కేటాయింపు..
ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల విధానంలో ప్రభుత్వం కొత్త తరహా విధానానికి తెరతీసింది. ఆయా కళాశాలల్లో నేరుగా దరఖాస్తు చేసుకునే ప్రక్రియకు స్వస్తి చెప్పి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. రెండేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ ప్రవేశ విధానం సఫలీకృతం కావడంతో ఇదే పద్ధతిని ఇంటర్‌కూ అనుసరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇష్టం వచ్చినట్లు ఫీజులు దండుకుంటూ అడ్మిషన్లు తీసుకుంటున్న కార్పొరేట్‌ ప్రైవేట్‌ కళాశాలలకు ఇకపై అడ్డుకట్ట పడనుంది. విద్యార్థుల మెరిట్‌ «ఆధారంగానే సీట్లు కేటాయిస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాణ్యమైన కళాశాలలో సీట్లు లభించే అవకాశం ఉంది.

మింగుడు పడని యాజమాన్యం..
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లు సైతం ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులకే కల్పించాల్సి రావడంతో ప్రైవేట్, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలకు ఈ విషయం మింగుడు పడడం లేదు. ప్రత్యేక కోర్సులంటూ వేలాది రూపాయలు అదనంగా గుంజుతున్న వారు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయాన్ని పలు కళాశాలల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. జిల్లాలోని పలు కళాశాలలు ఐఐటీ ఫౌండేషన్, ఎంసెట్‌ తదితర కోర్సుల పేరుతో ఏడాదికి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. గతంలో విద్యార్థులను కళాశాలలు డిమాండ్‌ చేసిన మొత్తాన్ని చెల్లించే వరకు యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేసే వారు. 

జిల్లాలో 121 కళాశాలలు..
కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, మోడల్, సోషల్, బీసీ, ట్రైబల్‌ వెల్ఫేర్, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలు 121 ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా జిల్లాలో ఎక్కడైనా ప్రతిభ కలిగిన విద్యార్థులకు సీట్లు లభించే ఆవకాశం ఉంది. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో సీటు రాకపోవడం కొంత ఇబ్బంది కరంగానే పరిగణించే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ విధానం అన్ని విధాలా మేలు
– రామచంద్రం, డీఐఈఓ 

ప్రభుత్వం తీసుకున్న ఆన్‌లైన్‌ విధానంతో విద్యార్థులకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. పేద విద్యార్థులకు న్యాయం కలుగుతుంది. కళాశాలల్లో ఫీజుల నియంత్రణతో తల్లిదండ్రులకు ఊరట వస్తుంది. ఆన్‌లైన్‌ విధానంతో ప్రతిభ ఉన్న వారికి చోటు లభిస్తుంది. ఇప్పటికే తమకు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంతోనే ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని ఆదేశాలు అందాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 21 నుంచి మొదలైంది. ప్రవేశాలు గడువు ఈనెల 30తో ముగుస్తుంది.  జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.   

మరిన్ని వార్తలు