సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

29 Apr, 2018 02:47 IST|Sakshi

ఆకస్మిక తనిఖీలు, దాడులు చేస్తాం

ఇప్పటికే 396 కాలేజీలకు నోటీసులు 

మే 21న ప్రవేశాల నోటిఫికేషన్‌..ఆ తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ

అఫిలియేషన్‌ లేని కాలేజీల్లో చేరొద్దు

ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌  

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుమతులు రద్దు చేస్తామని జూనియర్‌ కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియెట్‌ బోర్డు స్పష్టం చేసింది. వివిధ జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తున్న 396 కాలేజీలపై ఆకస్మిక దాడులు నిర్వహించామని పేర్కొంది. వాటికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని వివరించింది. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో 132, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్‌ జిల్లాలో 173 కాలేజీలున్నాయని పేర్కొంది.

కాలేజీ హాస్టళ్లు, నిర్వహణ తదితర అంశాలపై శనివారం ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్‌ మీడియాతో మాట్లాడారు. సెకండియర్‌ పూర్తయి ఎంసెట్, ఐఐటీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రసక్తే లేదన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహిస్తే కాలేజీ అఫిలియేషన్‌ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని విద్యా సంస్థలు అకాడమీల పేరుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒక కాలే జీలో ప్రవేశం పొంది మరో కాలేజీలో రెండేళ్ల పాటు కోర్సులో శిక్షణ తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, కాలేజీ తరగతులకు హాజరు కాకుండా అకాడమీ తరగతులకు మాత్రమే హాజరవడం బోర్డు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు.

నోటిఫికేషన్‌ తర్వాతే ప్రవేశాలు..
జూనియర్‌ కాలేజీలకు సంబంధించి ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. మే 21న ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీలు తమ అఫిలియేషన్‌ సర్టిఫికెట్‌ను కాలేజీ ప్రాంగణంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,684 కాలేజీలు అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా 786 కాలేజీలకు అఫిలియేషన్‌ ఇచ్చామన్నారు.

మరో 559 కాలేజీల అఫిలియేషన్‌ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని, వీటిలో ఎక్కువగా మౌలిక వసతుల లోపాలున్నాయన్నారు. ఏప్రిల్‌ 30 తర్వాత అఫిలియేషన్‌ కాలేజీల జాబితాను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అఫిలియేషన్‌ ఉన్న కాలేజీల వివరాలను తెలుసు కున్న తర్వాతే అడ్మిషన్లు పొందాలని సూచించారు. కాలేజీ హాస్టళ్లను కూడా బోర్డు పరిధిలోకి తెచ్చామని, హాస్టళ్ల నిర్వహణకు ఈ నెల 20 వరకు వచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల సంఖ్య అతి తక్కువగా ఉందని, యాజమాన్యాలు దరఖాస్తులపై శ్రద్ధ చూపలేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హాస్టల్‌ దరఖాస్తు గడువు పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.   

మరిన్ని వార్తలు