కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య

22 Feb, 2018 17:18 IST|Sakshi

విద్యాలయాల అప్‌గ్రెడేషన్‌కు చర్యలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి..

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు

జిల్లాలో 25 కేజీబీవీలు  

బాలికా విద్యకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్‌ విద్యను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

రెంజల్‌(బోధన్‌):  కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారాయి. ప్రస్తుతం ఈ విద్యాలయాల్లో ఆరో తరగతినుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందిస్తున్నారు. ఇంటర్‌ కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించడంతో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య ప్రవేశపెట్టాలని వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అంగీకారం తెలిపినట్లు డిప్యూటీ సీఎం కడియం ప్రకటించారు. దీంతో పేద విద్యార్థినుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.  

జిల్లాలో 25 కేజీబీవీలు..
పేద విద్యార్థినులు చదువు మధ్యలో మానేయకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం కేజీబీవీలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వసతితో కూడిన విద్య అందుతోంది. మధ్యలో బడిమానేసిన, అనాథ, నిరుపేద విద్యార్థినులకు ప్రవేశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థినులూ ఇందులో చదువుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో 3,855 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అయితే పదో తరగతి వరకే విద్య అందుతుండడం పేద విద్యార్థినులకు శాపంగా మారింది. చదువుకోవాలని ఉన్నా.. వసతితో కూడిన విద్య అందించే కళాశాలలు లేకపోవడంతో చాలామంది పదో తరగతితోనే చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్‌ చేయాలని యోచిస్తోంది. వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఏర్పాటైన సబ్‌ కమిటీ కూడా ఇదే సిఫారసు చేయడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇంటర్‌ ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.  

ప్రయోజనాలు..
కేజీబీవీలలో ఇంటర్‌ ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. పదో తరగతి తర్వాత డ్రాపౌట్లు తగ్గుతాయి. పదో తరగతి తర్వాత చదువుకోవడానికి వసతితో కూడిన కళాశాలలు లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు త్వరగా వివాహం జరిపిస్తున్నారు. ఇంటర్‌ ప్రవేశపెట్టడం వల్ల అలాంటి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బాల్య వివాహాలను నియంత్రించవచ్చు.  

డ్రాపవుట్లు తగ్గుతాయి..
పదో తరగతి తర్వాత చాలామంది బాలికలు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఫలితంగా డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. కేజీబీవీల్లో ఇంట ర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల డ్రాపవుట్లు తగ్గుతాయి. కేజీబీవీల్లో పదో తరగతి తర్వాత ఇంటర్‌ వరకు విద్యనభ్యసించవచ్చు. పై చదువులకు భరోసా ఏర్పడుతుంది.  – మమత, ప్రిన్సిపాల్, కేజీబీవీ, రెంజల్‌  

మంచి అవకాశం..
కేజీబీవీల్లో ఇప్పటి వరకు పదో తరగతి వరకే తరగ తులు ఉండేవి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ వరకు కూడా తరగతులు నిర్వహిస్తే మాలాం టి వారికి మంచి అవకాశం లభించినట్లే. బాగా చదువకుని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తాం. పేదరికం వల్ల మధ్యలో చదువు మానేసిన నాకు కేజీబీవీలో చదువుకునే అవకాశం లభించింది.  – సమత, పదో తరగతి విద్యార్థిని

ఆర్థికభారం తగ్గుతుంది..
కేజీబీవీల్లో ఇంటి కంటే మంచి వాతావరణం ఉంటుంది. నాణ్యమైన భోజనంతో పాటు ఉన్నతమైన విద్య లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్య ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది. మాలాంటి నిరుపేద విద్యార్థులకు చక్కటి అవకాశం. నేను నా చెల్లెలు కస్తూర్బాలో చదువుకుంటు న్నాం. తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది.  – స్వాతి, పదో తరగతి విద్యార్థిని
     

మరిన్ని వార్తలు