నిఘా నీడలో..

28 Feb, 2020 10:16 IST|Sakshi

సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

కళాశాలలకు చేరిన ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు

నిమిషం ఆలస్యమైనా సెంటర్‌లోకి నిరాకరణ

స్పష్టం చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు

సాక్షి, సిటీబ్యూరో: సమస్యాత్మక పరీక్ష కేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. మాల్‌ ప్రాక్టీస్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ప్రత్యేకంగా నియమించింది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 404280 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 462 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 16 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేంద్రాలపై నిఘా ఉంచుతున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రశ్నపత్రాలను మరో రెండు మూడు రోజుల్లో స్థానికంగా ఎంపిక చేసిన పోలీస్‌స్టేషన్లకు తరలించి ప్రత్యేక కౌంటర్లలో భద్రపర్చనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 26, మేడ్చల్‌ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 28 పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. 

సెంటర్‌ లొకేషన్‌ యాప్‌ ప్రారంభం..
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సెంటర్‌ లొకేషన్‌ యాప్‌ను సిద్ధం చేశారు. గతేడాదే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించలేకపోయింది. ప్రస్తుతం ఈ యాప్‌ పని తీరును మరింత ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి సెంటర్‌ లొకేషన్‌ యాప్‌ అని టైప్‌ చేసి, ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుంది. యాప్‌లో హాల్‌టికెట్‌ నంబర్‌ టైప్‌ చేసి సెర్చ్‌ చేస్తే.. విద్యార్థి ఉన్న చోటికి పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. పరీక్ష కేంద్రానికి ఏ రూట్‌లో ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ ద్వారా హాల్‌టికెట్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇలా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం కూడా అవసరం లేదు. కాలేజీ ఫీజు పూర్తిగా చెల్లించని విద్యార్థులకు ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు వారి హాల్‌ టికెట్లు ఇవ్వకుండా మొండికేస్తుండటం తెలిసిందే. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే యాజమాన్యాలకు చెక్‌ పెట్టేందుకే ఈ అవకాశాన్ని అందుబాటలోకి తెచ్చినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.  

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
నిర్దేశిత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఉదయం 8 గంటలకే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.  

విద్యార్థులు ఒత్తిడికిలోనుకావొద్దు
పరీక్షల సమయం సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. తమ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలని, తమ కాలేజీకి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఆశతో కొన్ని కాలేజీల యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది చదువు.. అది చదువు అంటూ వారిని బలవంతం చేస్తున్నారు. కీలకమైన ఈ సమయంలో పిల్లలకు అండగా నిలవాల్సిన తల్లిదండ్రులు కూడా మార్కులు లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.   మార్కులు, ర్యాంకులే జీవితం కాదు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలకు అండగా నిలవాలి. వారిని మానసికంగా పరీక్షలకు సిద్ధం చేయాలి.   – జయప్రదాబాయి, జిల్లాఇంటర్మీడియట్‌ ఆఫీసర్, హైదరాబాద్‌

పరీక్షల తేదీలు.. సమయం ఇలా
ఫస్టియర్‌: మార్చి 4 నుంచి 21 వరకు  
సెకండియర్‌: మార్చి 5 నుంచి 23 వరకు
సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

మరిన్ని వార్తలు