కూలీ కూతురు.. మండల టాపర్‌

20 Jun, 2020 12:00 IST|Sakshi
తల్లిదండ్రులతో రమ్య

నంగునూరు(సిద్దిపేట): కూలీ పనులు చేస్తేనే పూట గడిచే కుటుంబం.. పైగా నిరక్ష్యరాస్యులు.. తమలాగ పిల్లలు కూలీ పనులు చేయకుండా చదివి ప్రయోజకులు కావాలని కలలు కన్నారు. వారి కలను నిజం చేస్తూ ఇంటర్‌లో మండల టాపర్‌గా దేవర రమ్య నిలిచింది. మండల కేంద్రం నంగునూరుకు చెందిన దేవర ఉప్పలయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఉప్పలయ్య స్థానికంగా ఇనుప సామాను వ్యాపారం చేయడంతో పాటు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా అతని భార్య పద్మ బీడీలు చుట్టడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి పెద్ద కూతురు రమ్య అక్కేపల్లి మోడల్‌స్కూల్‌లో చేరి పదో తరగతిలో మంచి జీపీఏ సాదించింది. అదే స్ఫూర్తితో ఇంటర్‌ బైపీసీలో 920 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల బాధ చూసి చక్కగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే పట్టుదలతో చదివానని ఆమె పేర్కొంది. కాగా రెండవ కూతురు రవళి గతేడాది పదో తరగతిలో పది జీపీఏ సాదించి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది.

రైతు కుటుంబంలో విద్యాకుసుమం : రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్‌ సాధించిన సువర్ణ

హుస్నాబాద్‌: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇర్రి సువర్ణ ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్‌ సాధించింది. హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో చదివిన సువర్ణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ (ఇంగ్లీష్‌ మీడియం)లో  978/1000 మార్కులు సాధించింది. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన ఇర్రి మల్లారెడ్డి, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసింది. రెండవ కుమార్తె అపర్ణ కూడా హుస్నాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో 2017–2019 సంవత్సరంలో ఎంపీసీలో 922 మార్కులు సాధించి జిల్లా స్ధాయిలో ర్యాంకర్‌గా నిలిచింది. సువర్ణ గత విద్యా సంవత్సరంలో  ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 456/470 మార్కులు సాధించి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ కళాశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లకు ఎలాంటి లోటు రాకుండా చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలన్నదే లక్ష్యమని సువర్ణ తెలిపారు.

మరిన్ని వార్తలు