ఒత్తిడికి చిత్తయ్యి..

20 Apr, 2019 02:18 IST|Sakshi

ఇంటర్‌లో ఫెయిలయ్యామని పలువురు విద్యార్థుల ఆత్మహత్య

ఇద్దరు ఆత్మహత్యాయత్నం.. ఒత్తిడే కారణం: విద్యావేత్తలు

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మానసిక ఒత్తిడితో పసిమనసులు రాలిపోయాయి. పరీక్షల్లో ఫెయిలైతే జీవితమే లేదన్న క్షణికాలోచనతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం ఇంటర్మీడియెట్‌ ఫలితాలు వెలువడ్డ తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్మీడియెట్‌ బోర్డు అలసత్వం, మార్కుల వేటలో తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తెస్తుండటంతో ఫెయిలైతే అంతేనన్న ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధ కలిగిస్తోంది. 

మార్కుల వెనుక పరుగు.. 
పోటీ ప్రపంచంలో అధిక మార్కులు రావాలంటూ తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడి ఓ వైపు.. కార్పొరేట్‌ కాలేజీల్లో ఇరుకు గదుల్లో కుక్కి బయట ప్రపంచమే తెలియకుండా చేస్తున్న చదువు మరోవైపు.. జీవితంపై వారికి విరక్తి కలిగేలా చేస్తోంది. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేని పరిస్థితికి చేరుస్తోంది. ఫలితంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న ఒత్తిడి కారణంగా ఫెయిలైన విద్యార్థులు ఏం సమాధానం చెప్పాలో, సమాజంలో తమను హేళన చేస్తారేమోనన్న ఆందోళనతో ఆత్యహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నారు.
 
ఒత్తిడి తగ్గించే చర్యలేవీ? 
జీవితంలో విజ్ఞానం కోసమే చదువు అన్న ఆలోచనను విద్యార్థుల్లో పెంపొందించడం, మార్కుల కోసం జీవితం కాదన్న సత్యాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ఇటు ఇంటర్మీడియెట్‌ బోర్డు అటు విద్యార్థుల తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యల వైపు చూస్తున్న విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేసే కౌన్సిలర్లు కాలేజీల్లో లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదన వ్యక్తమవుతోంది. గతంలో వరుస ఆత్మహత్యలు చోటు చేసుకున్న సమయంలోనూ ఇంటర్‌ బోర్డు ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ఓ కమిటీ కూడా వేసింది. ఇంటర్‌లో మార్కుల విధానం తీసేసి గ్రేడింగ్‌ విధానం అమల్లోకి తేవాలని చెప్పింది. అలాగే ప్రతి కాలేజీలో హాస్టళ్లలో క్వాలిఫైడ్‌ కౌన్సిలర్లను నియమించాలని, వారి నేతృత్వంలోనే ముభావంగా ఉండే విద్యార్థులను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన కౌన్సిలింగ్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. దానిపై బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది తప్ప కాలేజీల్లో కౌన్సిలర్ల అమలు విధానంపై ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులకు మార్గదర్శనం చేసే వారు లేకుండా పోవడంతో ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని 1,560 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా దాదాపు 900కు పైగా హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడా కౌన్సిలర్ల నేతృత్వంలో ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవని ఇంటర్‌ విద్య అధికారులే పేర్కొంటున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులు.. 

  • నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలంలో ఏఆర్‌పీ క్యాంప్‌నకు చెందిన తోట వెన్నెల (18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 
  • కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన అనామిక (16) సికింద్రాబాద్‌ బన్సిలాల్‌పేట్‌లోని ఇంటర్‌ చదువుతోంది. తెలుగులో ఫెయిల్‌ కావడం మనస్తాపంతో సమీపంలోని తన చిన్నమ్మ ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
  • వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట దర్గాకు చెందిన మోడెం భానుకిరణ్‌ (17) ద్వితీయ సంవత్సరం గణితంలో ఫెయిలైనందుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 
  • కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాగేందర్‌ అనే విద్యార్థి ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యానన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
  • నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన గాయత్రి.. ఫెయిలైనందుకు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. 
  • యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల గ్రామ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన సోలిపురం శివకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఓ సబ్జెక్టులో 2 మార్కులు తక్కువొచ్చాయని ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
మరిన్ని వార్తలు