వర్గపోరులో కమలనాథులు

7 Feb, 2018 19:55 IST|Sakshi
ప్రారంభం కానున్న కార్యాలయం

పోటాపోటీగా పార్టీ కార్యాలయాల ఏర్పాటు   

కమలం పార్టీలో లుకలుకలు

తాండూరు టౌన్‌: ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు నియోజకవర్గ బీజేపీ శ్రేణులు. చివరికి వర్గ పోరులో కమలనాథులు విచ్చుకుపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాండూరులో బీజేపీ జెండా ఎగురేయాలని నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆపార్టీ శ్రేణులు పల్లెబాట పట్టారు. కార్యకర్తలంతా ఒకే తాటిపై నడుస్తూ వ్యతిరేక పార్టీలను ఢీకొంటూ, క్యాడర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఒకే నాయకుడి నాయకత్వంలో కొనసాగుతున్న దాఖలాలు కనపడడంలేదు. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న యూ.రమేష్‌కుమార్‌ ఓ వర్గంగా కొనసాగుతుండగా, ఎన్‌ఆర్‌ఐ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పటేల్‌ రవిశంకర్‌ మరో వర్గంగా చెలామణి అవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ తనకే ఖచ్చితంగా వస్తుందని పటేల్‌ రవిశంకర్‌ ధీమాగా ఉన్నారు. తానూ బరిలో ఉన్నానంటూ రమేష్‌కుమార్‌ ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఆందోళనల్లో ఇరువర్గాలు కలిసి పోరాటం చేసిన దాఖలాలు ఎక్కడా కనపడడంలేదు. దీంతో రమేష్‌కుమార్‌ సాయిపూర్‌లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. అక్కడే ఆయన వర్గానికి చెందిన, తటస్థంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు, నాయకులు సమావేశమవుతున్నారు.

తాజాగా రవిశంకర్‌ తాండూరులోని బస్టాండు ఎదురుగా మరో కార్యాలయాన్ని బుధవారం ఏర్పాటుచేస్తున్నారు. ఒకే పట్టణంలో ఒకే పార్టీకి చెందిన రెండు కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. కలిసి ఉండాల్సిన వారు ఇలా విడిపోవడం వల్ల పార్టీకి నష్టమేనని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా తాను ముందుగా ఏర్పాటుచేసిన కార్యాలయమే అధికారికమైందని, రవిశంకర్‌ ఏర్పాటుచేస్తున్న కార్యాలయం ఆయన వ్యక్తిగతమని రమేష్‌కుమార్‌ చెప్పడం విశేషం. రానున్న ఎన్నికల దృష్ట్యా అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా పెద్ద భవనంలో బస్టాండు ఎదురుగా పార్టీ కార్యాలయం ఏర్పాటుచేస్తున్నామని రవిశంకర్‌ చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో సైతం రెండు వర్గాలు పోటాపోటీగా కొనసాగుతున్న విషయం విధితమే. ఏ పార్టీ వారైనా ఐకమత్యంతో, పార్టీ ప్రయోజనాల కోసం కృషి చేయకపోతే మనుగడ కష్టసాధ్యమే.

మరిన్ని వార్తలు