అసమ్మతి సెగ

29 Aug, 2018 12:49 IST|Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. కొద్ది రోజులుగా రగులుతున్న అసమ్మతి సెగ తిరుగుబాటుకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమానికి, గులాబీ దళపతి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లాలో మంగళవారం ఒకేరోజు మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమనడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రామగుండం ఎమ్మెల్యే, ఆర్‌టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణపై ప్రత్యర్థులు బాహాటంగా తిరుగుబాటు చేసి  నిరసనలు తెలపగా, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్‌ రమేష్‌బాబుపై ఆయన వ్యతిరేకవర్గం వె య్యి మందితో సమావేశం నిర్వహించింది. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శం కుస్థాపన సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భర్త, సింగిల్‌విండో డైరెక్టర్‌ గడ్డం చుక్కారెడ్డి కొబ్బ రికాయ కొట్టేందుకు సిద్ధం కాగా ఎమ్మెల్యే బొడిగె శోభ ఆయనను అడ్డుకుని వెనక్కి నెట్టేయడం వివాదాస్పదమైంది. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌ల సమక్షంలో జరిగిన ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

రామగుండంలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం భేటీ..
రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు. ఎన్‌టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్‌లో సోమారపు అసమ్మతి నేతలంతా మంగళవారం సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ గ్రూప్‌ రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవల తనపై అవిశ్వాసం పెట్టించి పదవి నుంచి దింపేసిన ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వ్యతిరేక శక్తులను ఏకంగా చేసే పనిలో మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణ ఉన్నారు.

రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఆశిస్తున్న కోరుకంటి చందర్, కందుల సంధ్యారాణితోపాటు మాజీ డిప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్, పార్టీ నాయకులు పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమారపు సత్యనారాయణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నేరవేర్చలేదని, ఉద్యమ సమయంలో పార్టీలో పని చేసిన నాయకులను, కార్యకర్తలను పూర్తిగా విస్మరించి, తన చెప్పు చేతల్లో ఉన్న కొంతమందితోనే రాజకీయం చేస్తున్నారని ఈ సందర్భంగా సోమారపుపై ధ్వజమెత్తారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతోపాటు డివిజన్ల వారీగా సమావేశాల నిర్వహణకు, కార్యాచరణకు సిద్ధం కావడం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది.

వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా..
వేములవాడ నియోజకవర్గంలో అధికార పార్టీలో అసమ్మతి సెగ పతాక స్థాయికి చేరుకుంది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో మంగళవారం సమావేశమైంది. ఎమ్మెల్యే రమేశ్‌బాబును తప్పించడమే లక్ష్యంగా ఆపార్టీకి చెందిన దాదాపు వెయ్యి మందికిపైగా కార్యకర్తలు కలసి అదే వేదిక నుంచి బాహాటంగా ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని, జెండాలు మోసి, పార్టీ కోసమే పనిచేస్తున్న తమపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే బరి నుంచి రమేశ్‌బాబును తప్పించాలని భీష్మ ప్రతిజ్ఙ చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రమేశ్‌ బాబు స్వచ్ఛందంగా వైదొలగాలని కూడా డిమాండ్‌ చేశారు. వేములవాడలో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

మంత్రి, ఎంపీల సమక్షంలో చొప్పదండిలో గలాటా..
చొప్పదండిలో సీనియర్‌ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌ ముందే ఎమ్మెల్యే శోభ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భర్త చుక్కారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఎంపీ వినోద్‌ సూచన మేరకు ఫైర్‌ స్టేషన్‌ భవన ప్రారంభోత్సవం వద్ద చుక్కారెడ్డి టెంకాయ కొడుతుండగా ఎమ్మెల్యే శోభ అడ్డుకుని వెనక్కి నెట్టారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి రాజేందర్, ఎంపీ వినోద్‌ వారించడంతో ఎమ్మెల్యే తమ అనచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రితో చుక్కారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు