పాల ఉత్పత్తులు పెంచేందుకు కృషి

2 Jun, 2017 01:25 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో పాల ఉత్పత్తులను పెంపొందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా డీఆర్‌డీఏ కార్యాలయంలో పాలమిత్రలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాల ఉత్పత్తిలో దేశం ప్రథమ స్థానంలో ఉందన్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు విజయ డెయిరీలో పాలు విక్రయించే వారికి లీటరుకు నాలుగు రూపాయల ఇన్‌సెంటివ్‌ పెంచామని తెలిపారు. జిల్లాలో 10 పాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పాల సేకరణలో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో దూడల పెంపకం చేపడుతున్నామని అన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లాలో విజయ డెయిరీకి 300 నుంచి 400 లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతుందని, ఆగస్టు మాసం వరకు వెయ్యి లీటర్ల పాల సేకరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతీ రైతు రెండు గేదెలు పెంచుకుంటే ఉపయోగకరంగా, ఆర్థికంగా లబ్ధిపొందవచ్చని అన్నారు. గ్రామ స్థాయి నుంచి పాల సేకరణకు పాలమిత్రలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో రాజేశ్వర్‌రాథోడ్, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రసాద్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, టీఆర్‌ఎస్‌ నాయకుడు గోవర్థన్‌రెడ్డి, పాలమిత్రలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు