కరోనా 'వారియర్స్‌'

12 May, 2020 07:38 IST|Sakshi

మానవత్వానికి మారు పేరు

సహనానికి సాటి రారు ఎవరు

నర్సుల వైద్య సేవలు నిరుపమానం

కోవిడ్‌ చికిత్సల్లో వీరి పాత్ర కీలకం

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

కళ్లల్లో కరుణ. చూపుల్లో ప్రేమ. చేతల్లో దయాగుణం. మాటల్లో మానవత్వం. సహనానికి వారు ప్రతిరూపం. నిరుపమాన సేవకు ప్రతిబింబం. అనుపమాన కర్తవ్యానికి తార్కాణం.ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పాలిట వారు ప్రత్యక్ష దైవాలు. రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి వైద్య సేవలే పరమావధిగా భావిస్తారు. వారే నర్సులు. రోగికి నయమయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుని కాపాడతారు. విధి నిర్వహణలో రేయనకా..పగలనకా శక్తివంచన లేకుండా పని చేస్తారు. వైద్యుల తర్వాత ప్రధాన భూమిక పోషిస్తారు. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ చూపిన దారే వీరికి ఆదర్శం. ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న అభాగ్యుల పాలిట ‘దేవుళ్లు’గా మారారు. వైరస్‌తో మానసికంగా కుంగిపోతున్న రోగులకు మనోస్థైర్యం కల్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.  సేవా తత్పరత చాటుతున్న కొందరు నర్సులపై ప్రత్యేక కథనం.     

లక్డీకాపూల్‌: సేవకు ప్రతిరూపమైన నర్సులు ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శక్తివంచన లేకుండా రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందుకు తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. వైద్యులు మందులు రాస్తే.. ఆ మందులను ఎప్పుడు? ఎలా? వాడాలో వివరించి వారికి అండగా నిలుస్తున్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో మానసికంగా కుంగిపోతున్న రోగులకు మనోధైర్యం కల్పించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం గాంధీ, నిమ్స్, ఉస్మానియా, నిలోఫర్, కింగ్‌కోఠి, ఫీవర్, చెస్ట్‌ ఆస్పత్రి, నేచర్‌ క్యూర్, సరోజినిదేవి కంటి ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు నర్సులు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం!

మాది రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి. మానవతామూర్తి మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో సుమారు 14 ఏళ్ల క్రితం అవుట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికన నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్‌ నర్సుగా చేరాను. పెళ్లయిన తర్వాత ఉద్యోగం మానేయమన్నారు. కానీ పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇంట్లో వాళ్లను ఒప్పించి విధులు నిర్వహిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే ప్రతి బిడ్డను సొంత బిడ్డలా చూసుకుంటూ అనుక్షణం వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నా. ఏప్రిల్‌ 15న ఓ బేబీ నిలోఫర్‌ అత్యవసర విభాగంలో అడ్మిటైంది. విధి నిర్వహణలో భాగంగా సదరు శిశువుకు ఇంజక్షన్లు ఇచ్చాను. శిశువు గుక్కపట్టి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేక ఎత్తుకుని హత్తుకున్నాను. సదరు బేబీకి 17వ తేదీన కరోనా పాజిటివ్‌ వచ్చింది.

శిశువుకు సన్నిహితంగా మెలిగిన నాతో సహా ఆ రోజు విధుల్లో ఉన్నవారందరీనీ క్వారంటైన్‌ చేశారు. 25వ తేదీన నా నుంచి శాంపిల్‌ కలెక్ట్‌ చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. రిపోర్ట్‌ జారీలో ఆలస్యం కావడం, అప్పటికే ఇంటి వద్ద పిల్లలు ఏడుస్తుండటంతో 27న మధ్యాహ్న మా తమ్ముని బైక్‌పై శివరాంపల్లికి వెళ్లాను. పాప ఆకలేస్తోందని ఏడ్వడం.. వంట చేసిన తర్వాత, స్వయంగా తినిపించాలని ఒత్తిడి చేయడంతో రాత్రి పాపకు అన్నం తినిపించాను. ఆ తర్వాత ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. నాకు కరోనా పాజిటివ్‌ అని చెప్పి, గచ్చిబౌలి నుంచి 108 అంబులెన్స్‌ను పంపించారు. అదే రోజు రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. భర్త, ఇద్దరు పిల్లలు, అత్తామామలకు పరీక్షలు నిర్వహించగా.. నా చేత్తో అన్నం తిన్న నా కుమార్తెకు పాజిటివ్‌ వచ్చింది. నెగిటివ్‌ వచ్చిన నా భర్త సహా అత్తామామలను హోం క్వారంటైన్‌ చేశారు. పాజిటివ్‌ వచ్చిన నా బిడ్డను కింగ్‌కోఠి ఆస్పత్రిలో.. నన్ను గాంధీలో ఉంచారు. ఇలా ఒక్కొక్కరం ఒక్కో చోట ఉండిపోవాల్సి వచ్చింది. నా విజ్ఞప్తిని మన్నించి వైద్యులు నా బిడ్డను కూడా నా వద్దకే చేర్చారు. ప్రస్తుతం ఇద్దరం వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకుంటాం. – పద్మ, స్టాఫ్‌ నర్సు, నిలోఫర్‌

కరోనా దూరం చేసింది..
కరోనా వైరస్‌ కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే ఒక సిస్టర్‌ కరోనా వైరస్‌తో బాధపడుతోంది. దాంతో ఆస్పత్రిలో నర్సులందరూ భయంగానే డ్యూటీ చేస్తున్నాం. ఈ క్రమంలో  కుటుంబసభ్యులతో కాకుండా విడిగా ఉండాల్సి వస్తోంది. మా విభాగం ఎప్పుడూ పేషెంట్లతో ఫుల్‌గా ఉంటుంది. కీమోథెరపీ, రేడియాలజీ చేయించుకునే వారు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కరోనా సమయంలో వీరందరికీ వైద్యసేవలు అందిస్తున్నాం. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – కనక తార, నర్సు,మెడికల్‌ ఆంకాలజీ విభాగం, నిమ్స్‌ 

చాలా ఇబ్బందిగా ఉంది.. 
వైరస్‌తో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వ్యాధి సొకకుండా తీసుకుంటున్న చర్యలతో డ్యూటీ చేయడం కష్టంగానే ఉంది. రోజంతా పీపీఈతో ఉండటంతో వేడిని తట్టుకోలేకపోతున్నాం. అయినా తప్పడం లేదు. మా ఎస్‌ఐసీయూలో ఎప్పుడూ పేషెంట్లు ఫుల్‌గానే ఉంటున్నారు. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌లో మాకేమీ లేదు.  ఈ విభాగానికి కరోనా ప్రభావం అసల్సేదు. ఫస్ట్‌లో ఈఎండీ, ఓటీ విభాగాల్లో వైరస్‌ ఛాయలు కన్పించాయి. ఇద్దరు నర్సులకు.. ఇద్దరు వర్కర్లకు వైరస్‌ లక్షణాలు కన్పించినా ఆ తర్వాత రిపోర్ట్స్‌ నెగెటివ్‌ వచ్చాయి. ఇప్పుడు వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఏది ఏమైనా ఈ కరోనా చాలా గందరగోళం చేస్తోంది. – స్లీవమ్మ, నర్సు, న్యూరాలజీ విభాగం, నిమ్స్‌ 

మరిన్ని వార్తలు