‘న్యాక్‌’ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు

17 Feb, 2018 03:17 IST|Sakshi
మంత్రి తుమ్మల సమక్షంలో జరిగిన ఒప్పందపత్రాలు చూపుతున్న న్యాక్, విదేశీ ప్రతినిధులు

ఇక్కడ శిక్షణ పొందినవారికి ఏ దేశంలోనైనా ఉద్యోగం పొందే వీలు 

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ రంగంలోని పలు అంశాల్లో యువతకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఎన్‌ఏసీ) మరో ఘనత సాధించింది. న్యాక్‌లో శిక్షణ పొందినవారికి అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుకాబోతున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన నేషనల్‌ ఓపెన్‌ కాలేజ్‌ నెట్‌వర్క్‌(ఎన్‌వోసీఎం), ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌తో కలసి త్రైపాక్షిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ భిక్షపతి ఆ సంస్థల ప్రతినిధులతో కలసి సంతకాలు చేశారు.

ప్రస్తుతం న్యాక్‌ జారీ చేస్తున్న సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. ఇక్కడ అత్యంత మెరుగైన శిక్షణ ఇస్తున్నట్టు తెలిసినా కొన్ని అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తటపటాయిస్తున్నాయి. సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటే వారిని నేరుగా ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. దీన్ని గుర్తించిన న్యాక్‌ డీజీ భిక్షపతి ఈ ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే సంస్థ హైదరాబాద్‌లోని న్యాక్‌ క్యాంపస్‌ను పరిశీలించి అక్కడి మౌలిక వసతులు, శిక్షణ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన సంస్థతో కలిసి న్యాక్‌తో త్రైపాక్షిక భాగస్వామ్యం ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. దీంతో ఇక నుంచి న్యాక్‌లో శిక్షణ పొందిన వారికి ఏ దేశంలోనైనా ఉద్యోగాలు పొందేందుకు మార్గం సులభమవుతుందని న్యాక్‌ డీజీ భిక్షపతి ‘సాక్షి’తో చెప్పారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా