అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్ట్

28 Sep, 2014 03:39 IST|Sakshi

భువనగిరి :స్నేహితులతో కలిసి ఆవారాగా తిరిగే ఓ యువకుడు జల్సాలకు అలవాటుపడ్డాడు. సరదాలను తీర్చుకునేందుకు దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు..చిల్లర దొంగతనాల నుంచి అంతర్‌రాష్ట్ర స్థాయికి ఎదిగాడు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డాడు. వాంటెండ్ క్రిమినల్‌గా మారి, చివరకు పోలీసులకు చిక్కాడు. భువనగిరి రూరల్ సీఐ జువ్వాజి నరేందర్‌గౌడ్ శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ సతీష్‌రెడ్డితో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు.
 
 ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం సర్వాయ్‌పాడు పాతబంజర్ గ్రామానికి చెందిన పోడియం మాధవరావు  స్వగ్రామంలోనే 8వ తరగతి వరకు చదువుకున్నాడు. స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. మొదటి దొంగతనం  స్వగ్రామంలోని కిరాణ దుకాణంలో చేసి పోలీసులకు చిక్కాడు.18 నెలల శిక్ష అనుభవించిన అనంతరం గత ఏడాది జూలై 4వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. బయటికి వచ్చిన మాధవరావు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో సుమారు 24 కేసుల్లో 10 లక్షలకు పైగా సొత్తును అపహరించాడు. ఆ డబ్బుతో బైక్ కొనుగోలు చేయడమే గాకుండా తన  స్నేహితుడు బాలకృష్ణ ఇండికా కారుకనుగోలు చేసేందుకు రూ.లక్ష అప్పు ఇచ్చాడు.
 
 అన్ని చోరీలు ఒంటరిగానే...
 మాధవరావు ఒంటరిగానే దొంగతనాలు చేసేవాడు. ఎవరి సహాయం తీసుకోడు. తన స్నేహితుడు కారులో ఉదయం చోరీ చేసే దుకాణాల వద్ద రెక్కీ నిర్వహిస్తాడు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుకాకుండా వచ్చి గడ్డపారతో దుకాణాల షట్టర్లు పైకిలేపి చోరీలు చేసేవాడు. చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ ఏడు జిల్లాల పోలీసులకు సవాల్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన భువనగిరి మండలం రాయగిరిలో మెయిన్‌రోడ్డుపై గల వెంకటేశ్వర, నాగార్జున వైన్స్‌లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి ఓ చోట విఫలమయ్యాడు. అయితే  వెంకటేశ్వర వైన్స్ గల్లాపెట్టెనుంచి 2లక్షల రూపాయలు అపహరించుకుపోయాడు. అలాగే గత సంవత్సరం 2013 సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి భువనగిరి పట్టణంలోని సనా మెడికల్ దుకాణంలో రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు.
 
 పట్టుబడ్డాడు ఇలా..
  నల్లగొండ జిల్లా బీబీనగర్ టోల్‌గేట్ సమీపంలో  శనివారం పోలీస్‌లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తున్న మాధవరావును పోలీసులు తనిఖీ చేశారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో తాను చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయపెట్టాడు. వెంటనే నివా సం ఉంటున్న హైదరాబాద్‌లోని ముషిరాబాద్‌కు వెళ్లి అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు రూ.3.28 లక్షల నగదు, పల్సర్ మోటార్‌సైకిల్, ఒక తులం బంగారు గొలు సు, అకాయ్‌టీవి, హోంథియేటర్, 4 సెల్‌ఫోన్‌లు, ఇండికా కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. దొంగిలించిన సొత్తుతో కారు కొన్న బాలకృష్ణ, చోరీలకు పాల్పడిన మాధవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో  భువనగిరి రూరల్ ఎస్‌ఐ భిక్షపతి, ఏఎస్‌ఐ బాసు, కానిస్టేబుల్ సిరాజ్, రాజు, సిబ్బంది మధు, నర్సింగ్, మహేందర్‌లు సహకరించారని చెప్పారు.
 
 

మరిన్ని వార్తలు