డిజిటల్‌ ఇండియాలో ఇంటర్నెట్‌ బ్లాక్‌!

19 Aug, 2018 01:25 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థకు, భావ ప్రకటనకు అత్యంత కీలకం ఇంటర్నెట్‌. కానీ తప్పుడు సమాచారాన్నీ వదంతుల్నీ అడ్డుకునే పేరిట నెట్‌ సర్వీసుల్ని యథేచ్చగా నిలిపేస్తున్నాయి ప్రభుత్వాలు. సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) గణాంకాల ప్రకారం.. రాష్ట్రాలు గత 7నెలల్లో మొత్తం 95 సార్లు ఇంటర్నెట్‌ సర్వీసులనునిలిపేశాయి. ఇంతకు ముందెన్నడూ ఇన్ని ఘటనలు నమోదు కాలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. గత ఏడేళ్లలో మొత్తం 233 సార్లు నెట్‌ బ్లాక్‌చేసినట్లు రికార్డు అయింది.

ఇవి మీడియా స్వేచ్ఛ, హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయంటూ మానవ హక్కుల బృందాలు విమర్శిస్తున్నాయి. అత్యవసర సందర్భాల్లో తప్ప నెట్‌ సేవలు నిలిపేయరాదన్న నిబంధనను రాష్ట్రాలు ఖాతరు చేయట్లేదు. పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో మోసాల్ని నివారించే పేరిట రాజస్తాన్‌ ప్రభుత్వం జూలై 14, 15 తేదీల్లో ఇంటర్నెట్‌ను బ్లాక్‌ చేసిన వైనం తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రంలో 2017 ఆగస్టు–2018 మే మధ్య మొత్తం 21 సార్లు నెట్‌ను షట్‌డౌన్‌ చేశారు.


చిన్న సమస్యకూ షట్‌డౌన్‌..
ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ ప్రకారం– 2017లో 79సార్లు, 2016లో 30 సార్లు నెట్‌ సేవల్ని బ్లాక్‌ చేశారు. గత 7 నెలల్లో జమ్మూ కశ్మీర్‌ (36), రాజస్తాన్‌ (26)లో సర్వీసులు నిలిపేశారు. ఉత్తరప్రదేశ్‌లో7సార్లు, మహారాష్ట్రలో 5సార్లు ఆపేశారు. 2012–17 సంవత్సరాల మధ్య.. జమ్మూ కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో ఎక్కువసార్లు నెట్‌ షట్‌డౌన్‌ చేశారు.
   అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధన మండలి తాజా నివేదిక ప్రకారం.. 2012–17 మధ్య 16,315 గంటలపాటు నెట్‌ను నిలిపేయడం వల్ల భారత్‌కు దాదాపురూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ– కామర్స్, ఐటీ సర్వీసులు, పర్యాటకం మొదలైన రంగాలకు జరిగిన నష్టాన్ని మండలి పరిగణనలోకి తీసుకుంది. చిరు వ్యాపారాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి కూడా నెట్‌ బ్యాన్‌తో నష్టపోయాయి.  
 రాష్ట్రాల్లోపరిస్థితులను అదుపు చేసేందుకు నెట్‌ షట్‌డౌన్‌ను ప్రభుత్వాధికారులు ఒక సాధనంగా వాడుకుంటున్నారనే విమర్శ వినిపిస్తోంది. పండుగ ఊరేగింపులు, పరీక్షల్లో మోసాలు, సామాజిక సమస్యలపై జరిగే నిరసన ప్రదర్శనలు, పెద్ద రాజకీయ నాయకుల పర్యటనల సందర్భాల్లోకూడా నెట్‌ను బ్లాక్‌ చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నెట్‌ సేవల నిలిపివేతకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించకపోవడం, చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.  
 బ్రూకింగ్‌సంస్థ 2015 జూలై– 2016 జూన్‌ మధ్య జరిపిన అధ్యయనం ప్రకారం 19 దేశాల్లో నెట్‌ సర్వీసుల నిలిపివేత వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టం దాదాపు రూ.16 వేల కోట్లు, భారత్‌కు రూ.96.8 కోట్లు నష్టమొచ్చింది.  
రాజకీయ కారణాల వల్ల అలజడులు చెలరేగిన సందర్భాల్లో నెట్‌పై నిషేధం విధించడం వల్ల హింస మరింత పెరిగే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఐక్య రాజ్యసమితి ప్రకారం.. ఇంటర్నెట్‌ కలిగి ఉండటం మనిషి హక్కుల్లో ఒకటి. దీన్ని సుప్రీంకోర్టు 2017లో ప్రా«థమిక హక్కుగా పేర్కొంది.
షట్‌డౌన్లు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) ‘కీప్‌ అజ్‌ ఆన్‌లైన్‌’పేరిట సంతకాల సేకరణ చేపట్టింది. దీనిపై 16,000 మందికి పైగా సంతకా లు చేశారు. 100 సంస్థలు సంతకాలతో మద్దతు ప్రకటించాయి.  
 2017లో ప్రభుత్వం చేసిన షట్‌డౌన్‌ నిబంధనలు ఫలితాలివ్వట్లేదని ఐఎఫ్‌ఎఫ్‌ చెబుతోంది. నిబంధనల రూపకల్పన విషయంలో ప్రజలతో సంప్రదింపులు జరపకపోవడంపై అభ్యంతరాలు లేవనెత్తింది. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లభించలేదు.

మరిన్ని వార్తలు