ఇంటింటికీ ఇంటర్నెట్‌

7 Dec, 2017 04:29 IST|Sakshi
బుధవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఐటీ అధికారులతో మాట్లాడుతున్న కేటీఆర్‌

వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా అందిస్తాం: కేటీఆర్‌

ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి సమీక్ష

ఫార్మాసిటీకి త్వరలోనే పర్యావరణ అనుమతులు!

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికల్లా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తవుతున్న నేపథ్యంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే మిషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. బుధవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్రం భారత్‌ నెట్‌ కింద అందిస్తున్న ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంటింటికీ ఇంటర్నెట్‌ ద్వారా వచ్చే మార్పును ప్రపంచానికి చూపేందుకు మహేశ్వరం మండలంలోని 4 గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమో నెట్‌వర్క్‌ జనవరి మొదటి వారంలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు విజయ బ్యాంకు ఇస్తున్న రూ.516 కోట్ల రుణ పత్రాలను బ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణరాజు మంత్రికి అందజేశారు.

టీవర్క్స్‌ డిజైన్లు సిద్ధం చేయండి
పరిశ్రమల శాఖ సమీక్షలో భాగంగా టీహబ్‌–2, ఇమేజ్‌ టవర్, టీవర్క్స్‌ ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్‌ ఆ శాఖ అధికారులతో చర్చించారు. టీవర్క్స్‌ డిజైన్లు సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫార్మాసిటీకి త్వరలోనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు