ఏ మూలకైనా ‘వల’ వేస్తాం!

22 Feb, 2018 02:55 IST|Sakshi

ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రాంతానికీ ఇంటర్నెట్‌ సేవలు 

ఎఫ్‌ఎస్‌ఓసీతో సాధ్యమే: గూగుల్‌ ‘ఎక్స్‌’డైరెక్టర్‌ టామ్‌ మూర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గూగుల్‌.. సంచలనాలకు పెట్టింది పేరు. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ నిత్యావసరంగా మారిన ఈ సంస్థ ఇంకో అద్భుత విజయం సాధించింది. ప్రపంచంలో ఏమూలలో ఉన్న వారికైనా.. చిటికెలో మొబైల్, ఇంటర్నెట్‌ కనెక్షన్లను అందించేందుకు వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం ‘కనెక్టింగ్‌ ద నెక్ట్స్‌ బిలియన్‌’పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో గూగుల్‌ అనుబంధ సంస్థ ‘ఎక్స్‌’డైరెక్టర్‌ టామ్‌ మూర్‌ స్వయంగా వెల్లడించిన ఈ కొత్త టెక్నాలజీ వివరాలు.. 

‘ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవాలని గూగుల్‌ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం మేం భారీసైజు గాలి బుడగల్లో కొన్ని పరికరాలను ఉంచి ఇంటర్నెట్‌ను ప్రసారం చేయాలని ఒక ప్రాజెక్టు చేపట్టాం. ప్రయోగాలన్నీ విజయవంతం గానే సాగాయి. అయితే ఈ ప్రాజెక్టుల్లో భాగంగా మేం గాలి బుడగల్లో వాడిన ఓ పరికరం మా ఆలోచనలకు పదును పెట్టింది. ఒక బెలూన్‌ ఇంకోదాన్ని గుర్తించేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వాడే ఈ పరికరం లేజర్ల సాయంతో పని చేస్తుంది.

ఆకాశంలో విజయవంతంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించిన ఈ ‘ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్స్‌ (ఎఫ్‌ఎస్‌ఓసీ) టెక్నాలజీని భూమ్మీద వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు మొదలయ్యా యి. పరీక్షించి చూద్దామని శాన్‌ఫ్రాన్సిస్కో బేలో గతేడాది చిన్న ప్రయోగం చేశాం. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ఎల్తైన భవనాలపై రెండు ఎఫ్‌ఎస్‌ఓసీలు బిగించి పరీక్షించాం. సెకనుకు కొన్ని గిగాబైట్ల సమాచారం ప్రసారం చేయవచ్చని, అందుకోవచ్చని తేలింది. ఈ పరికరాలకు బదులు గా ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను వాడాల్సి వస్తే.. భారీగా కేబుల్‌ వేయాల్సి వచ్చేది. గోతు లు తవ్వడం, కేబుల్‌ వేయడం వంటి అన్ని పనులకు బోలెడంత ఖర్చయ్యేది. నెలల సమయం పట్టేది. ఇవేవీ లేకుండానే 2 గంటల సమయంలోనే మేం ఆ పని చేయగలిగాం. తర్వా తి కాలంలో ప్యూర్టారికోలో ప్రకృతి విపత్తు కారణంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ నాశనమైనప్పుడు ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షిం చి చూశాం. 2 వారాల సమయంలోనే అక్కడ విద్యుత్‌ టవర్లపై ఎఫ్‌ఎస్‌ఓసీలను ఏర్పాటు చేసి 90 వేల మందికి నెట్‌ సౌకర్యం కల్పించాం. 

చాపరాయిలోనూ సక్సెస్‌ 
ఎఫ్‌ఎస్‌ఓసీలతో అతితక్కువ సమయంలో ఎక్కడైనా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించవచ్చని స్పష్టమైన తర్వాత ఆ సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా చాపరాయిలోనూ డిజిటల్‌ వెలుగులు పంచేందుకు దీన్ని ఉపయోగించారు. అడవి మధ్యలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామానికి నాలుగంటే నాలుగు వారాల్లో పూరిస్థాయిలో కనెక్టివిటీ సాధించగలిగాం. ఈ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు వేల ఎఫ్‌ఎస్‌ఓసీల కొనుగోలుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గత నెలలోనే ఒప్పందం కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే సమీప భవిష్యత్తులో భారత్‌లోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం’.  

మరిన్ని వార్తలు