నేను మీలో ఒకడిని..

7 Nov, 2018 12:21 IST|Sakshi

   ‘సాక్షి’తో న్యూడెమోక్రసీ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య  

ఖమ్మం,ఇల్లెందు అర్బన్‌: గతంలో ఎమ్మెల్యేననో లేక పార్టీ నాయకుడిననో తానెప్పుడూ జనానికి దూరం కాలేదని, మరింత చొరవతో ప్రజలతో మమేకమయ్యానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ సీనియర్‌ నేత గుమ్మడి నర్సయ్య తెలిపారు. మన్యం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి..బొగ్గుట్ట (ఇల్లెందు) అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’ ఆయన్ను పలుకరించగా పలు విషయాలను వివరించారు.
  
సాక్షి: ఎమ్మెల్యేగా ప్రస్థానం చెబుతారా ?  
గుమ్మడి: నేను 1983 నుంచి 2014 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఐదుసార్లు గెలిచాను. 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచా. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడిన. ఎన్డీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలే..నాకు విజయాన్ని అందించాయి. ఎన్డీని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు పునర్విభజన చేసి, గుండాల, కారేపల్లి మండలాలు వేరుచేశారు.
  
సాక్షి: ఈసారి మీ ప్రచారం ఎలా ఉంది ?  
గుమ్మడి: గ్రామస్థాయిలో ప్రచారం ప్రారంభించలేదు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో  కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశాం. త్వరలో ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటి ప్రచారం చేస్తాం. చేసిన ప్రజా ఉద్యమాలు, సాధించిన విజయాలతోనే ప్రజల్లోకి వెళ్తాం. అందుకే పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఈ దఫా ఎన్నికల్లో ఎన్డీ గెలుపు ఖాయం. ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
 
సాక్షి: మీరు గెలిచినప్పుడు చేసిన అభివృద్ధి గురించి.. 
గుమ్మడి: ఐదుసార్లు గెలిచిన హయాంలో ప్రధానంగా ఇల్లెందు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. 132 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించాం. సింగరేణి షేప్‌ నిధులు రూ.8 కోట్ల వ్యయంతో పట్టణంలో రోడ్ల వెడల్పు చేశాం. చాలాచోట్ల సీసీ రోడ్లు నిర్మించినం. వాటర్‌ట్యాంకులు పూర్తి చేశాం. ప్రభుత్వ వైద్యశాల భవనం కట్టించేందుకు కృషి చేశాం. తాగునీటి వసతి, రోడ్లు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాం.

 పార్టీలు మారే  వ్యక్తులను నమ్మొద్దు.. 
ఒక పార్టీలో పోటీ చేసి గెలిచిన తర్వాత ధనార్జానే లక్ష్యంగా పెట్టుకొని వేరే పార్టీల్లోకి మారే వ్యక్తులను నమ్మొద్దు. ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడే వారికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. నోట్ల ప్రలోభాలకు గురై నియోజకవర్గ అభివృద్ధి వెనుకబాటుకు కారకులుగా మారకూడదు. కొన్ని పార్టీలు ప్రచారంలో ఇష్టమొచ్చినట్లు డబ్బు పంచుతుండడం బాధాకరం.  -గుమ్మడి నర్సయ్య

మరిన్ని వార్తలు