హామీల అమలులో బీజేపీ  విఫలం: నారాయణ

13 Jan, 2019 04:37 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బీజేపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు వివిధ అంశాలపై ఆత్మావలోకనం చేసుకోవడంలో ఆపార్టీ విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రతీ కుటుంబానికి వారి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నిం చారు. జీఎస్టీపై వ్యతిరేకత ఇటీవలి ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కన్పించడంతో బీజేపీకి జ్ఞానోదయమైందన్నారు.

ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం గోబెల్స్‌ గనుక వినుంటే ఆత్మహత్య చేసుకునేవాడని ఎద్దేవా చేశారు. రఫేల్‌ ఒప్పందంలో మోదీనే ఓ దళారిలా వ్యవహరించినప్పుడు ఇక మధ్యవర్తులతో ఎందుకని విమర్శించారు. శబరిమలలో మహిళలకు సమానహక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకించి బీజేపీ మహిళా వ్యతిరేకి అన్న ముద్ర వేసుకుందన్నారు. పౌరసత్వం గుర్తింపు అంశంలో ప్రభుత్వమే మత విభజనకు పూనుకుందన్నారు.

న్యాయవ్యవస్థను బ్లాక్‌మెయిల్‌ చేయడమే
లోక్‌సభ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామాలయం కట్టి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించడం న్యాయవ్యవస్థను బ్లాక్‌మెయి ల్‌ చేయడమే అవుతుందని నారాయణ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఈ నెలలోనే బాబ్రీమసీదు అంశం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. 

>
మరిన్ని వార్తలు