‘నాణ్యత..నై’పై కొనసాగుతున్న విచారణ

7 Jan, 2020 08:06 IST|Sakshi
ప్రహరీ పిల్లర్ల  నాణ్యతను పరిశీలిస్తున్న దృశ్యం

సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం రేంజ్‌ పరిధిలోని చాతకొండ నుంచి లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు క్రాస్‌ రోడ్‌ మీదుగా కేసీఎం కళాశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ప్రహరీ నాణ్యత విషయంలో విచారణ కొనసాగుతోంది.  రూ.6.32 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రహరీ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని గత నెల 25న ‘నాణ్యత నై’ అనే శీర్షికతో సాక్షి కథనాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డిసెంబర్‌ 31న ఈ నిర్మాణాలపై విచారణ జరిపారు.  ప్రహరీ నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్‌ నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.

దీనిపై పూర్తి నివేదికలను పంపాలని జిల్లా అటవీ అధికారులను విజిలెన్స్‌ అధికారి రాజా రమణారెడ్డి ఆదేశించారు. దీంతో సోమవారం సీసీఎఫ్‌ రాజారావు, డీఎఫ్‌ఓ రాంబాబు ప్రహరీ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గోడల నిర్మాణంలో వాడిన పిల్లర్ల నాణ్యతలను, ఇసుక, సిమెంట్‌ పరిమాణాల శాంపిళ్లను సేకరించారు. ఈ పనులను కెమెరాలో రికార్డు చేశారు. కాగా, ఈ ప్రహరీ గోడల నిర్మాణ పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడినట్లు తెలిసింది. కొత్తగూడెం రేంజ్‌ అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి స్థానిక ఎఫ్‌ఎస్‌ఓకు ఇంచార్జ్‌ బాధ్యత అప్పగించారని సమాచారం. నిర్మాణ పనులను పర్యవేక్షించిన డీఆర్వోపైనా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా అటవీ శాఖాధికారి రాంబాబును వివరణ కోసం పలుమార్లు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మరిన్ని వార్తలు