ఇంటర్‌ ఉచిత కార్పొరేట్‌ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

28 May, 2019 02:11 IST|Sakshi

జూన్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరణ

వివిధ సంక్షేమ శాఖల పరిధిలో 2,262 మందికి అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఇంటర్మీడియట్‌లో ఉచిత కార్పొరేట్‌ విద్యనందిస్తోంది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన పేదలను ఈ పథకం కింద ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. జూన్‌ 9లోపు ఆన్‌లైన్‌ ద్వారా ఈపాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూన్‌ 13న ప్రకటిస్తారు. జూన్‌ 14 నుంచి సర్టిఫికెట్లు పరిశీలించి 17లోగా తుది జాబితాను వెల్లడిస్తారు. పలు సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,262 మందిని ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు.

ఏటా రూ. 38 వేల ఫీజు.. 
ఉచిత ఇంటర్‌ కార్పొరేట్‌ విద్య పథకం కింద ఎంపికైన విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.38 వేలు ఖర్చు చేస్తోంది. ఎంపికైన విద్యార్థికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పి స్తుంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నందున కాలేజీల ఎంపికను ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేపడుతోంది. అన్ని రకాల మౌలిక వసతులతోపాటు కాలేజీ రికార్డు, ఫలితాలు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తోంది. ఈ పథకం కింద తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఫీజులు నిర్ధారించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు పెంచాలనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 

ఎవరు అర్హులు.. 
2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 7 జీపీఏ పైబడి స్కోర్‌ సాధించి, స్థానిక విద్యార్థి అయి ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.1.5 లక్షలు మించరాదు. పూర్తి వివరాలను సంక్షేమ శాఖ అధికారులు ఈపాస్‌ తెలంగాణ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థి కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు రేషన్‌ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆధార్‌ తప్పనిసరి. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ సమర్పించాలి. మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా సంక్షేమ అధికారిని నేరుగా సంప్రదించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు