ఇరాన్‌ సదస్సుకు మేయర్‌కు ఆహ్వానం 

3 Nov, 2018 01:35 IST|Sakshi

రామ్మోహన్‌తో హెగ్బిన్‌ ఘోమి భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌లోని ముషాద్‌నగరంలో ‘భూ సంబంధిత, ఆర్థిక విధానాలు, మున్సిపల్‌ పాలన బాధ్యతలు’ అంశంపై నవంబర్‌ 27 నుంచి 30 వరకు నిర్వహించే సదస్సుకు హాజరుకావాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను ఇరాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ మహ్మద్‌ హెగ్బిన్‌ ఘోమి కోరారు. హెగ్బిన్‌ ఘోమి శుక్రవారం మేయర్‌తో జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇరాన్‌ లోని ఇస్ఫాన్‌లో నవంబర్‌ 22, 24ల్లో జరిగే ఇస్ఫాన్‌డే ఉత్సవాలకూ మేయర్‌ను ఆహ్వానించారు.

మేయర్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ, హైదరాబాద్, ఇరాన్‌ దేశాల మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక బంధం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇరాన్‌ సంస్కృతి, జీవన విధానం బలంగా ఉందని, చివరి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో ఇది మరింత బలోపేతంగా ఉండేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. హెగ్బిన్‌ ఘోమికి చార్మినార్‌ను బహూకరించి దుశ్శాలువతో మేయర్‌ రామ్మోహన్‌ çసన్మానించారు. 

మరిన్ని వార్తలు