‘జర్నలిస్టుల సంక్షేమ నిధి’ దరఖాస్తుల ఆహ్వానం

1 Aug, 2018 01:34 IST|Sakshi

హైదరాబాద్‌: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి ఆగస్టు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014, జూన్‌ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్‌వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలన్నారు.

దరఖాస్తుల్ని కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్‌ చిరునామా: ఇంటి నెం.5–9–166, చాపెల్‌ రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు–500001కు పంపవలసిందిగా ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్‌ నంబర్‌ 040–23298672, 23298674లను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను http://ipr.tg.nic.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు