గజ్వేల్‌.. జిగేల్‌

10 Dec, 2019 11:02 IST|Sakshi
 గజ్వేల్‌లోని ఐవోసీ(ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌) 

ప్రారంభానికి సిద్ధమైన..

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, ఐఓసీ, ఆడిటోరియం

రేపు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సాక్షి, గజ్వేల్‌ : తానూ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గాన్ని దేశంలోనే బంగారుతునకగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గ రూపు రేఖలను మార్చేశారు.  ముఖ్యంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌కు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో నయా లుక్‌ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అధునాతన వసతులతో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్, ఐఓసీ(ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌), ఆడిటోరియం నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ మూడింటిని 11 బుధవారం రోజు  ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ ఫలితంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ ఇప్పటికే కొత్తరూపును సంతరించుకుంది. వందల కోట్ల వ్యయంతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  ఇప్పటికే రింగురోడ్డు, ఎడ్యుకేషన్‌హబ్, పాండవుల చెరువు అభివృద్ధి, వంద పడకల ఆసుపత్రి, “డబుల్‌ బెడ్‌రూం’ మోడల్‌ కాలనీ తదితర పనులు పూర్తయ్యాయి. ఇందులో రింగు రోడ్డు, డబుల్‌ బెడ్‌ రూం మినహా మిగితావి వినియోగంలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ అత్యాధునిక వసతులతో “వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌’ మార్కెట్‌ నిర్మాణం చేపట్టారు. 2016 మార్చి నెలలో పట్టణంలోని పాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రభుత్వ భవనాలకు చెందిన 6.04 ఎకరాల భూమిలో ఈ మార్కెట్‌ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రూ.22.85కోట్లతో ఈ పనులు అప్పటి రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో ఆరు భారీ షెడ్ల నిర్మాణం జరిగింది. ఈ షెడ్లను గాల్వెలూమ్‌ రూఫ్‌తో నిర్మించారు.

షెడ్లలో 38 పండ్లు, పువ్వుల దుకాణాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా కూరగాయల కోసం 150, మటన్, చికెన్, చేపల విక్రయాల కోసం 52 షాపులను నిర్మించారు. మరో 16 వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా ఒక సూపర్‌మార్కెట్‌ ఇక్కడ సైతం నిర్మించారు. ఇక్కడ విక్రయించే వస్తువులు ఎప్పుడు తాజాగా ఉండే విధంగా కోల్డ్‌ స్టోరేజీను సైతం నిర్మించారు. మార్కెట్‌కు కొత్త లుక్‌ తీసుకురావడానికి క్లాక్‌  టవర్‌ను 30 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. మార్కెట్‌లోకి వచ్చే ప్రజలకు మంచినీటి వసతి కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. మొత్తంగా ఎకరన్నర విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతుండగా మిగతా విస్తీర్ణంలో ల్యాండ్‌ స్కేపింగ్, పార్కింగ్‌ నిర్మాణాలు పూర్తయ్యాయి. వేలమంది ఒకేసారి క్రయవిక్రయాలు జరిపే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి శబ్ధ కాలుష్యం, కూరగాయలు, ఇతర పదార్థాల నుంచి ఎలాంటి చెడు వాసనలు రాకుండా షెడ్లను 35ఫీట్ల ఎత్తులో నిర్మించారు. అదే విధంగా స్లాబ్‌ల నిర్మాణాలు 20 ఫీట్ల ఎత్తులో జరిగాయి. 

ఆకట్టుకుంటున్న విగ్రహాలు 
ఇందిరాపార్క్‌ వైపు మార్కెట్‌ ప్రధాన ద్వారం ఏర్పాటు చేయగా..  మరో రెండు గేట్లను సైతం నిర్మించారు. ఇక్కడ వస్తువులను డంప్‌ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక దారిని ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్‌లో 30 రకాలకు చెందిన నీడ, పూల జాతులకు సంబంధించిన సుమారు 25 వేలకుపైగా మొక్కలు నాటారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలు ఆవరణలోని పచ్చిక బయళ్లలో సేద తీరాలనిపించేలా మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చేవారి పిల్లల కాలక్షేపం కోసం మార్కెట్లోనే పలు రకాల ఆటవస్తువులను ఏర్పాటు చేశారు. ఇందులో 6 రకాల ఆట వస్తువులు బిగించారు. మార్కెట్‌ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఆటవస్తువులు చిన్నారులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి రైతు దంపతుల విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పల్లె సంస్కృతిని కళ్లకు కట్టే విధంగా ఉన్న మరికొన్ని విగ్రహాలు సైతం చూపరులను కట్టిపడేస్తున్నాయి. మార్కెట్లో ఎప్పటికప్పుడు కూరగాయల వివరాలు, వాటి ధరలను తెలుసుకునేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

కూరగాయలను కొనుగోలు చేసేందుకు వచ్చేవారు ఈ స్క్రీన్లపై ఉన్న ధరలను చూసి... తమకు నచి్చన కూరగాయలను కొనుగోలు చేసేందుకు వీలుగా మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో మొత్తం మూడు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిఘా నీడలో పెట్టారు. మార్కెట్‌లో ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను బిగించారు. ప్రధాన ద్వారాలతో పాటు మార్కెట్‌లోని స్టాళ్ల వద్ద మొత్తం 24 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతకు పెద్దపీట వేసేందుకు అధునాతనమైన సీసీ కెమెరాలు మార్కెట్లో ఉన్నాయి. మార్కెట్‌లో కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం దుకాణాలే కాకుండా మరో 16 దుకాణ షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించారు. ఈ మడిగెల్లో ఇతరుల కోసం వాణిజ్య వ్యాపారం చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 13 దుకాణ సముదాయాలకు వేలం పాట పూర్తికాగా..  మరో 3 దుకాణాలను మార్కెట్‌ కార్యాలయ కార్యకలాపాల కోసం సిద్ధం చేశారు.  

అద్భుత కళాక్షేత్రం.. మహతి
రవీంధ్రభారతి తరహాలో కళాక్షేత్రం రూ. 19.5కోట్ల వ్యయంతో ఆడిటోరియంను నిర్మించారు. దీనికి “మహతి’ అని నామకరణం కూడా చేశారు. ముట్రాజ్‌పల్లి రోడ్డు వైపున ఉన్న రెండకరాల స్థలంలో దీనిని నిర్మించారు. 5,500 స్కైర్‌ మీటర్ల విస్తీర్ణంలో ఆడిటోరియం నిర్మించారు. ఇందులో రెండు ఫంక్షన్‌ హాల్స్‌ ఉండగా.. ప్రధాన హాలులో వీఐపీ సీట్లతో కలుపుకొని 1100 సీట్ల సామర్థ్యం, రెండో మినీ హాలును 250 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఇంకా కాంపౌండ్‌ వాల్, ముందు భాగంలో వాటర్‌ ఫౌంటెన్, ల్యాండ్‌ స్కేపింగ్‌ నిర్మించారు. ఈ కళాక్షేత్రానికి వచ్చే చూపరులను ఆకట్టుకునే తరహాలో ఆడిటోరియంలో 8 రకాల తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించే కళాకృతులను ఏర్పాటు చేశారు. ఆవరణలో 2500 స్వైర్‌ మీటర్ల విస్తీర్ణంలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. రెండు ఫంక్షన్‌ హాల్స్‌కు వేర్వురుగా డైనింగ్‌ హాల్‌లను పైభాగంలో నిర్మించారు. వృద్ధులు, చిన్నపిల్లలు డైనింగ్‌ హాల్‌కు వెళ్లేందుకు వీలుగా ఇప్పటి వరకు ఒక లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. కాగా నారధుని వీణ పేరు “మహతి’గా ఈ ఆడిటోరియానికి నామకరణం చేశారు. గజ్వేల్‌ను గొప్ప కళాక్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఆడిటోరియం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ముందుగానే ప్రకటించారు. ఏసీ సౌకర్యంతో త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న ఈ కళాక్షేత్రంలో సాహితీ, కవుల సమ్మేళనాలే కాకుండా ప్రభుత్వ సభలు, సమావేశాలు, ఇతర ప్రధాన కార్యక్రమాలు ఇక్కడ జరుపుకునే విధంగా అవకాశం కలి్పంచనున్నారు.  
ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌.. 
గజ్వేల్‌ పట్టణంలోని సంగాపూర్‌ మార్గంలో రూ.42.50 కోట్ల వ్యయంతో ఐవోసీ(సమీకృత కార్యాలయ భవన సముదాయం) నిర్మాణం పూర్తయ్యింది. లక్షా 44 వేల స్వై్కర్‌ ఫీట్ల విస్తీర్ణంలో ఏ, బీ, సీ బ్లాకులుగా భవనాల నిర్మాణం ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు వేర్వేరుగా గదుల నిర్మాణం జరిగింది. ఏ బ్లాకులో డైనింగ్‌ హాల్, క్యాంటిన్, ఎలక్ట్రిక్‌ విభాగం ఉండగా.... బీ బ్లాకులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 13 కార్యాలయాలు, 52 గదులను నిర్మించారు. అలాగే మొదటి అంతస్తులో 12 కార్యాలయాలు, 48 గదులు, రెండో అంతస్తులో 12 కార్యాలయాలు, 48 గదుల నిర్మాణాలు పూర్తయ్యాయి. అదే విధంగా సీ బ్లాకును “గడా’ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయంతో పాటు మల్టిపర్పస్‌ కార్యాలయానికి వినియోగించనున్నారు. ఐవోసీలోని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అధికారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విశాలమైన పార్కింగ్‌ సౌకర్యం కలి్పంచారు.  

మరిన్ని వార్తలు