జోరుగా ఐపీఎల్ బెట్టింగ్

20 May, 2015 00:32 IST|Sakshi

మిర్యాలగూడ : ఐపీఎల్-8 క్రికెట్ ఆటపై మిర్యాలగూడలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. రోజుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొంతమంది డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నాటి నుంచి బెట్టింగ్‌లు సాగుతున్నప్పటికీ క్వాలిఫై మ్యాచ్‌ల దశకు చేరుకోవడంతో బెట్టింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఇటీవల వరల్డ్‌కప్ క్రికెట్‌లో కూడా బెట్టింగ్‌లు సాగినప్పటికీ అంతకుమించి ఐపీఎల్-8లో బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్‌చౌక్, పాత బస్టాండ్, హౌసింగ్ బోర్డు, రెడ్డికాలనీ, డాక్టర్స్ కాలనీ, బంగారుగడ్డ ప్రాంతాలలో బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులు కావడం వల్ల యువకులు పూర్తిగా క్రికెట్ బెట్టింగ్‌లపైనే దృష్టి సారించారు. యువతతో పాటు విద్యార్థులు సైతం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు ఆటలు కొనసాగుతుండటం వల్ల రాత్రి 11 గంటల వరకు కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బెట్టింగ్‌లలో వందలాది మంది పాల్గొంటుండగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి.
 
 వెయ్యికి మూడు వేలు
 బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు వెయ్యి రూపాయలకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. కేవలం ఒక ఆటలో గెలుపు, ఓటములు మాత్రమే కాకుండా సిక్స్‌లు, ఫోర్‌లతో పాటు స్కోరుపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. చివరి ఓవర్లో ఎంత స్కోరు చేస్తారనే విషయంపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు ఎక్కడ ఉన్నా బెట్టింగ్ పెట్టే వారు మాత్రం ఫోన్‌లో మాట్లాడి నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సాయంత్రం అయిందంటే యువకులు గుంపులు, గుంపులుగా చేరి ఫోన్‌లో మాట్లాడుతూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు.
 
 చెన్నై - ముంబై ఆటకు
 భారీగా బెట్టింగ్
 ఐపీఎల్ -8లో ఫైనల్ బెర్త్ కోసం సాగే పోరులో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియాతో సాగే మ్యాచ్‌కు భారీగా బెట్టింగ్‌లు సాగాయి. ఈ రెండు జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. కానీ మొదటి మ్యాచ్‌లోనే ఫైనల్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుందని భావించి ఈ రెండు మ్యాచ్‌ల మధ్య సాగిన పోరుకు భారీగా బెట్టింగ్‌లు కొనసాగాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ఉదయం నుంచే బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
 
 డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి
 ఫోన్‌లో పరిచయాల ఆధారంగా బెట్టింగ్‌లు సాగిస్తున్న యువత, విద్యార్థులు డబ్బులు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు సమాచారం. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌లు నిర్వహించి డబ్బులు చెల్లించలేక ముగ్గురు విద్యార్థులు ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అజ్ఞాతంలోకి వెళ్లిన వారి తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా పట్టణంలో ఉన్నట్లు సమాచారం.   
 

మరిన్ని వార్తలు