చట్టం వేరు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలు వేరు

11 Aug, 2019 09:56 IST|Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 

విధుల్లో సవాళ్లను అధిగమిస్తేనే పురోగతి

పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసిన ఐపీఎస్‌లకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: నిజమైన ప్రజాస్వామ్యం అంటే న్యాయపరమైన సంయమనం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధపాలన ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. ఈ విధంగా జరిగినప్పుడే ప్రజాతంత్ర వ్యవస్థ నిజమైన మనుగడ సాధ్యం అవుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ‘ఆధునిక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వ్యక్తి పాలనకు, చట్టబద్ధ పాలనకు తేడా ఉంటుందని, చట్టపాలనకు కచ్చితంగా ప్రభుత్వ విధానాలతో పెనవేసుకుని ఉండనవసరం లేదని, ఈ తేడాను విధి నిర్వహణలో గుర్తించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుందన్నారు. చట్టబద్ధ పాలనకు న్యాయసమీక్ష మూలాధారం అవుతుందన్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని, ఇలాంటి సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటినీ అధిగమించినప్పుడే సమర్ధత బయటపడుతుందని యువ ఐపీఎస్‌ అధికారులకు సూచించారు.

మాతృభూమికి సేవలు అందించేందుకు కదనరంగంలోకి దిగే సమయంలో ఎదురయ్యే సవాళ్లను చట్టబద్ధంగానే అధిరోహించాలన్నారు. మీకున్న అధికారాలను నీతి, నిజాయితీతో సహేతుకంగా వినియోగించుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. దేశంకోసం సరిహద్దుల్లోనూ, ఇతర చోట్ల ప్రాణాలను ఫణంగా పెట్టిన సైనికుల సేవలకూ, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసులకు పెద్దగా తేడా లేదని, రెండు త్యాగాలూ వెలకట్టలేనివే అని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ కొనియాడారు. పోలీస్‌ అకాడమీ 1983లో ఏర్పాటైందని, ఆ తర్వాత ఏడాది ఆనాటి జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ బీకే నెహ్రూ నుంచి ఎంతో మంది ప్రముఖులు ఇదే వేదిక నుంచి ప్రసంగించారని అకాడమీ డైరెక్ట్టర్‌ డాక్టర్‌ అభయ్‌ చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌ జనరల్, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. 2018 బ్యాచ్‌కు చెందిన తొలి దశ శిక్షణలో ఉన్న 156 మంది ఐపీఎస్‌లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు