ఐపీఎస్‌లకు పదోన్నతులు

7 Feb, 2020 03:09 IST|Sakshi

ముగ్గురికి ఐజీ, ఆరుగురికి 

డీఐజీలుగా ప్రమోషన్‌ 

బదిలీలపై కొనసాగుతున్న ఉత్కంఠ 

డబుల్‌ ప్రమోషన్‌ దక్కినా.. కానరాని పోస్టింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మొత్తం 9 మందికి ప్రమోషన్లు రాగా, వీరిలో 2002 బ్యాచ్‌కు చెందిన ముగ్గురికి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ)గా, 2006 బ్యాచ్‌కి చెందిన మరో ఆరుగురికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఐజీ)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆదేశాలు ఇచ్చారు. 2002 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌కుమార్, ఎన్‌. శివశంకర్‌రెడ్డి, వి.రవీందర్‌లకు ఐజీలుగా ప్రమోట్‌ చేసింది. ప్రస్తుతం సీనియర్‌ ఎస్పీలుగా ఉన్న 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ, కె. రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్‌రావుకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది.

40మందికిపైగానే స్థానచలనం..! 
ఈసారి బదిలీలు భారీ ఎత్తున ఉంటాయని, దాదాపు 40 మందికిపైగా స్థానచలనం ఉంటుం దని ప్రచారం సాగుతున్న వేళ.. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా స్థాయిలో విధులు నిర్వహించే పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీలపై వాకబు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఈ జాబితాకు ఇంకా సీఎం ఆమోదం తెలపాల్సి ఉంది.

డబుల్‌ ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు.. 
గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్‌ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 10 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్‌లో ఎస్పీ ర్యాంకునుంచి సీనియర్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కుచెందిన కార్తికేయ, కె. రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్‌రావు ప్రస్తుతం పదోన్నతి జాబితాలోనూ చోటు దక్కించున్నారు. పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించిన వీరికి తాజాగా ప్రభుత్వం డీఐజీ హోదా కల్పించింది. అయినా, వీరి విషయంలోనూ ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో చాలమంది ఐపీఎస్‌ ఆఫీసర్లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రమోషన్‌ వచ్చిందని సంతోషించాలా? లేక కిందిస్థాయి పోస్టులోనే కొనసాగాల్సి వస్తోందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు. 

మరిన్ని వార్తలు