నేరాలకు వీసా!

5 Jan, 2019 02:23 IST|Sakshi

విజిట్‌ వీసాపై వస్తున్న ఇరాన్‌ దేశస్తులు

ఢిల్లీ అడ్డాగా అన్ని మెట్రో నగరాల్లో పంజా

మనీ ట్రాన్స్‌ఫర్, ఎక్స్చేంజ్‌ సంస్థలే టార్గెట్‌

హైదరాబాద్‌తో పాటు ఐదు చోట్ల నేరాలు

ఓ గ్యాంగ్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

మరో రెండింటి కోసం ముమ్మర గాలింపు

దేశంలోని మెట్రో నగరాలపై ఇరానియన్లు కన్నేశారు. ఓ కుటుంబంగా విజిట్‌ వీసాపై వస్తున్నారు. ఢిల్లీలోని లాడ్జిలు, హోటళ్లలో బస చేస్తున్నారు. అక్కడే ఓ వాహనం అద్దెకు తీసుకుని ప్రధాన మెట్రో నగరాల్లో సంచరిస్తున్నారు. ఓ సిటీకి చేరిన తర్వాత రాత్రికి బస చేయడం, ఉదయం దృష్టి మళ్లించి డబ్బు కాజేసే నేరం చేయడం పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ సహా ఐదు నగరాల్లోని మనీ ట్రాన్స్‌ఫర్, ఎక్స్చేంజ్‌ సంస్థల్ని ప్రధానంగా టార్గెట్‌ చేశారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇటీవల ఓ ముఠాను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో రెండింటి కోసం  గాలిస్తున్న పోలీసులు ఆ అరెస్టు వివరాలను గోప్యంగా ఉంచారు.  
 –సాక్షి, హైదరాబాద్‌

‘స్థానిక ముఠాలు’ ఇచ్చిన సమాచారంతో...
కొన్నేళ్ల క్రితం ఇరాన్‌ నుంచి వలస వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరిలో కొందరు నేరగాళ్లుగానూ మారారు. ప్రధానంగా కర్ణాటకలోని బీదర్, ధర్వాడ, మహారాష్ట్రలోని థానే సమీపంలో ఉన్న అంబివలీ, మధ్యప్రదేశ్‌తో పాటు రాష్ట్రంలోని గుంతకల్, మదనపల్లిలో ఉంటూ నేరాలు చేస్తున్నాయి. పోలీసుల అవతారం ఎత్తి తనిఖీల పేరుతో మహిళల నుంచి నగలు తదితరాలు కాజేసేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో ఈ ముఠాలు అటెన్షన్‌ డైవర్షన్స్‌గా పిలిచే దృష్టి మళ్లించి సొత్తు కాజేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం వరకు హైదరాబాద్‌పైనా వరుసపెట్టి పంజా విసిరారు. అటెన్షన్‌ డైవర్షన్‌ నేరాల గురించి తెలుసుకున్న ఇరాన్‌లోని వీరి బంధువులు టూరిస్ట్‌ వీసాపై వస్తున్నారు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.1.5 లక్షలకు మించి కాకపోవడంతో అనేక ముఠాలు వచ్చి పంజా విసరడం మొదలెట్టాయి. 

ఒంటరిగా విజయవంతం కావడంతో ముఠా...
ఇరాన్‌కు చెందిన బర్జిగరేసికా బెటేకల్మార్జీ అహ్మద్‌ కొన్నాళ్ల క్రితం విజిట్‌ వీసాపై వచ్చి అటెన్షన్‌ డైవర్షన్‌ నేరాలు చేసి వెళ్లాడు. మళ్లీ గత ఏడాది జూలైలో జెరేహ్‌దౌస్త్‌ కమ్రాన్, పహంఘే అలీ అతడి భార్య పహంగే మీనతో కలసి వచ్చాడు. తామంతా ఓ కుటుంబమని, విహారయాత్రకు వచ్చామంటూ చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో బస చేసిన వీరు అక్కడ నుంచి ఓ వాహనాన్ని రోజుకు రూ.2,300 అద్దెకు తీసుకున్నారు. దీనిపై ఒక్కో మెట్రో నగరానికి వెళ్లి రాత్రి బస చేసేవారు. అదే పూట మనీ ట్రాన్స్‌ఫర్, మనీ ఎక్సే ్చంజ్‌ సంస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవారు. మరుసటి రోజు ఆయా దుకాణాలకు సూటుబూటుతో వెళ్లి నిర్వాహకుల దృష్టి మళ్లించి క్యాష్‌ కౌంటర్‌లోని డబ్బు పట్టుకుని ఉడాయించేవారు. ఈ ముఠా అహ్మదాబాద్, షోలాపూర్, ముంబై, పుణేల్లో ఈ తరహా చోరీలు చేసింది. ఓ ప్రాంతంలో ఒక రోజు ఒక నేరం చేసి వెంటనే ఆ నగరాన్ని వదిలేస్తారు. మరో మెట్రో సిటీకి వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బులో వీలైనంత హవాలా మార్గంలో తమ దేశానికి పంపించి కొంతే దగ్గర ఉంచుకుంటారు. ఎవరైనా తనిఖీలు చేసినా అనుమానం రాకుండా తమ వద్ద ఉన్న దాన్ని ఇరాన్‌ కరెన్సీగా మార్చేసుకుంటారు. 

పుణే మార్గంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌...
ఈ గ్యాంగ్‌ గత ఏడాది ఆగస్టు 27న హైదరాబాద్‌ వచ్చి ఆ మరునాడు మాదన్నపేటలో ఉన్న వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో నేరం చేసింది. యజమాని దృష్టి మళ్లించి రూ.2 లక్షలతో ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం చేసిన వెంటనే ఇరానీ ముఠా నగరం విడిచిపెట్టాల్సి ఉంది. అయితే కాలకృత్యాల కోసం పాతబస్తీలోని ఓ షాపునకు వెళ్లి అవకాశం చిక్కడంతో క్యాష్‌ కౌంటర్‌లోని డబ్బు కాజేసింది. మాదన్నపేట కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసి ఆ దుకాణం వద్దకు వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి దుండగులు వాడిన వాహనం నంబర్‌ గుర్తించారు. దాని యజమానిని సంప్రదించగా.. ఇరాన్‌ నుంచి వచ్చిన కుటుంబానికి అద్దెకు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో సాంకేతికంగా కదలికలు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితులు పుణే మార్గంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్‌ 3న అక్కడకు వెళ్లిన టీమ్‌ నలుగురిని పట్టుకోవడంతో కథ వెలుగులోకి వచ్చింది. 

ఎంబసీ సాయం తీసుకోవాలనే యోచన..
ఈ గ్యాంగ్‌ను విచారించగా ఆ పని తాము చేయలేదని, తమ మాదిరిగానే మరో రెండు ముఠాలు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వీరు అరెస్టు అయినట్లు బయటకు వస్తే ఆ ముఠాలు అప్రమత్తం అవుతాయనే ఉద్దేశంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు. మిగిలిన రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అవసరమైతే ఎంబసీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అహ్మద్‌ గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చారు. వీసా వివరాలను తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేస్తే ఇరాన్‌ నుంచి వచ్చిన ముఠాలెన్ని అనేది తెలుస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ఈ తరహా ముఠాలు చేస్తున్న నేరాల్లో అనేకం అనివార్య కారణాల నేపథ్యంలో పోలీసుల వరకు రావట్లేదు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఇలాంటి అనేక అంశాలతో వ్యాపారులు ఫిర్యాదులకు వెనుకాడుతున్నారు. ఫలితంగా కొన్నాళుగా ఈ ముఠాల ఆగడాలు హద్దూ్ద అదుçపూ లేకుండా సాగిపోతున్నాయ’ని ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు