చలో భారత దర్శన్‌

17 Apr, 2018 13:10 IST|Sakshi
మాట్లాడుతున్న ఐఆర్‌సీటీసీ ఏజీఎం సంజీవయ్య

ఐఆర్‌సీటీసీ సమ్మర్‌ స్పెషల్‌ ప్యాకేజీలు

వేర్వేరుగా ఉత్తర, దక్షిణ భారత యాత్రలు

రేపటి నుంచి ‘గంగ, యమున యాత్ర’

12 రోజుల ప్రయాణం.. అనేక పర్యాటక ప్రాంతాల దర్శనం

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌ అర్బన్‌): వేసవి సెలవులను ప్రయాణికులు ఆహ్లాదంగా గడిపేందుకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) స్పెషల్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తర, దక్షిణ భారత యాత్రల పేరిట రెండు ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. గంగ, యమున యాత్ర ఈ నెల 18 నుంచి, దక్షిణ భారత యాత్ర మే 4 నుంచి ప్రారంభం కానుంది. భోజన సదుపాయం, వసతి, రవాణా అంతా ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది. ఈ రెండు ప్యాకేజీల వివరాలను ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.సంజీవయ్య సోమవారం నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ బబ్లూమీనా, ఐఆర్‌సీటీసీ సీనియర్‌ సూపర్‌వైజర్‌ పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

రేపటి నుంచే..
గంగ యమున యాత్ర ఈ నెల 18 నుంచిలై 29 వరకు కొనసాగుతుంది. 18న తెల్లవారుజామున 12.05 గంటకు ప్రత్యేక రైలు రేణిగుంట నుంచి బయల్దేరి కడప, యర్రగుంట్ల, గుత్తి, కర్నూల్, మహబుబ్‌నగర్‌ మీదుగా మధ్యాహ్నానికి కాచిగూడకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రైలు కాజీపేట్, రామగుండం మీదుగా 19న సాయంత్రం ఆగ్రాకు చేరుకుంటుంది. అక్కడ ఆగ్రా ఫోర్ట్, తాజ్‌మహల్‌ దర్శనం అనంతరం రాత్రి అక్కడే బస ఉంటుంది. అనంతరం ప్రత్యేక రైలులో 20న మధురకు తీసుకెళ్లి శ్రీకృష్ణ ఆలయం, శ్రీ కృష్ణుడి జన్మస్థానం చూపిస్తారు. అనంతరం తర్వాతి రోజు ఢిల్లీ చేరుకుంటారు. 21, 22 తేదీల్లో అక్షరధామ్, లోటస్‌ ఆలయాలు, కుతుబ్‌మీనార్, రాజ్‌ఘాట్, ఇండియా గేట్‌ చూపించి, షాపింగ్‌ చేయిస్తారు. 22న రాత్రి రైలు ఢిల్లీ నుంచి బయల్దేరి 23న హరిద్వార్‌కు చేరుకుంటుంది.

అక్కడ గంగాస్నానం అనంతరం మానస దేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ప్రత్యేక 24న ఆయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ రామజన్మ భూమి దర్శనం అనంతరం 25న అలహాబాద్‌కు తీసుకెళ్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల అనంతరం ఆనంద్‌భవనం మ్యూజియం చూపిస్తారు. 26న వారణాసి చేరుకుని గంగాస్నానం, గంగా హారతి, కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయాలు దర్శించుకుంటారు. 27న గయాకు చేరుకుంటారు. అక్కడ పెద్దలకు పిండ ప్రదానం తదితర కార్యక్రమాలు చేయిస్తారు. అనంతరం ప్రత్యేక రైలు 29న ఉదయం రైలు కాచిగూడకు చేరుకోవడంతో ఉత్తర భారత యాత్ర పూర్తి అవుతుంది. ఈ రైలులో మొత్తం 12 స్లీపర్‌ కోచ్‌లు, ఒక త్రీ టైర్‌ ఏసీ, ఒక పాన్‌ట్రీ కారు ఉంటుంది. 11 రాత్రులు, 12 పగళ్లు కొనసాగే ఈ ప్యాకేజీ ధర స్లీపర్‌ కోచ్‌ అయితే రూ.11,340, ఏసీ అయితే 13,860 ఉంటుంది. పిల్లలకైనా, పెద్దలకైనా టికెట్‌ ధరల్లో మార్పు ఉండదు.

4 నుంచి దక్షిణ భారత యాత్ర..
మే 4 నుంచి దక్షిణ భారత యాత్ర ప్రారంభ మవుతుంది. తెల్లవారు జామున 12.05 గంటలకు ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోల్, నెల్లూర్, రేణిగుంట మీదుగా తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. అక్కడ రంగనాథస్వామి, బ్రుహదీశ్వర ఆలయాల దర్శనం రామేశ్వరం వెళ్తారు. అక్కడి నుంచి మధురైలో మీనాక్షి ఆలయం, కన్యాకుమారిలో పర్యాటక ప్రాంతాల దర్శనం ఉంటుంది. అనంతరం త్రివేండ్రం వెళ్లి అక్కడి పద్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం గురువాయుర్‌కు చేరుకుని శ్రీ కృష్ణ ఆలయ దర్శనం చేయిస్తారు. ఆ తర్వాత కాట్పాడి మీదుగా శ్రీపురం బంగారు ఆలయం దర్శనం అనంతరం తిరుపతి చేరుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. 8 రాత్రులు 9 పగళ్లు కొనసాగే ఈ యాత్ర టికెట్‌ ధర స్లీపర్‌ క్లాస్‌ అయితే రూ.8,505, ఏసీ త్రీ టైర్‌ అయితే రూ.10,395 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం  www.irctctourism.com దర్శించవచ్చు.

టికెట్‌ బుక్‌ చేసుకోండి..
ఐఆర్‌సీటీసీ జోనల్‌ కార్యాలయం 040 2770 2407, 97013 60701, 97013 60647/671/697, 837400 07782/783, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ 9701360690, పర్యాటక భవన్‌ 040–2340 0606, 97013 60698.

మరిన్ని వార్తలు