గో.. గోవా, దుబాయ్, శ్రీలంక

22 Oct, 2018 11:04 IST|Sakshi

ఐఆర్‌సీటీసీ కొత్త టూర్‌ ప్యాకేజీలు

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త ప్రదేశాలు చూసొద్దామనుకునేవారికి, సెలవులు ఎంజాయ్‌ చేద్దామనుకునేవారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తీపి కబురు మోసుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలోని ప్రాంతాలకు మాత్రమే అందిస్తోన్న టూరిజం ప్యాకేజీలను ఈసారి విదేశాలకు అందుబాటులోకి తెచ్చింది. దేశంతోపాటు శ్రీలంక, దుబాయ్‌ వంటి విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం సరికొత్త టూరిజం ప్యాకేజీలు తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు. విమాన టికెట్లతోపాటు, విదేశాల్లో వసతి తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్యాకేజీల వివరాలు ఇలా..
చలో గోవా..!

హైదరాబాద్‌ నుంచి గోవాకు వెళ్లే వారికి ఈ ప్యాకేజీ సౌకర్యంగా ఉంటుంది. 3 రాత్రులు, 4 పగళ్లకు టూర్‌ ఉంటుంది. విమాన టికెట్లు, ఏసీ ట్రాన్స్‌పోర్ట్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, మిరామర్‌ బీచ్, ఓల్డ్‌ గోవా చర్చి, మంగేశి టెంపుల్, డోనా పౌలా బీచ్, మండోవి నదిలో క్రూజ్‌లో ప్రయాణం ఉంటుంది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కూడా కవర్‌ చేస్తారు. నవంబర్‌ 11న ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.17,609 వసూలు చేస్తారు.

దుబాయ్‌లో దూమ్‌ధామ్‌..!
కొంతకాలంగా మన దేశం నుంచి దుబాయ్‌కు పర్యాటకులు పెరిగారు. ఇలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. 4 రాత్రులు, 5 పగళ్లకు ఈ ప్యాకేజీని రూపొందించింది. డో క్రూజ్‌లో డిన్నర్, రోజంతా దుబాయ్‌ పట్టణ విహారం, మిరాకిల్‌ గార్డెన్, బుర్జ్‌ ఖలీఫా, గ్లోబల్‌ విలేజ్, ఎడారి ప్రయాణం–బెల్లీడాన్స్, త్రీస్టార్‌ హోటల్‌ వసతి, ట్రావెల్‌ ఇన్సూరెన్స్, ఇంగ్లిష్‌ మాట్లాడే గైడ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. డిసెంబర్‌ 1న ప్రారంభమయ్యే ఈ యాత్రకు హైదరాబాద్‌ నుంచి విమానం ఉంటుంది. ఒక్కో యాత్రికుడికి రూ.61,285 వసూలు చేస్తారు.
 

శ్రీలంకనూ చూసొద్దాం...
శ్రీలంకలోని శాంకరీ శక్తి పీఠాలతోపాటు ప్రముఖ స్థలాలను చూపించే రామాయణ యాత్ర ప్యాకేజీ ఇది. 4 రాత్రులు, 5 పగళ్లకు కలిపి ప్యాకేజీని రూపొందించారు. కొలంబో, దంబుల్లా, క్యాండీ, నువారా ఇలియా తదితర నగరాల సందర్శన ఉంటుంది. శాంకరీ శక్తి పీఠం, మనవారీ టెంపుల్, లక్ష్మీనారాయణ ఆలయం, రాంబోడ హనుమాన్‌ ఆలయం తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. డిసెంబర్‌ 7న మొదలయ్యే ఈ యాత్ర కోసం ఒక్కరికి రూ.47,540గా నిర్ణయించారు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయం, సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు