అలసట లేని ప్రయాణం

6 Oct, 2018 02:20 IST|Sakshi

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఐఆర్‌సీటీసీ రిటైరింగ్‌ రూములు

గంటల ప్రాతిపదికపైన చార్జీలు

సాక్షి, హైదరాబాద్‌: కాసేపు కునుకు తీసి బయలుదేరే సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. అందుకోసం రిటైరింగ్‌ రూములను అందుబాటులోకి తెచ్చింది. రిటైరింగ్‌ రూములను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత కాచిగూడ రైల్వేస్టేషన్‌దే. హైదరాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ శుక్రవారం ఈ రిటైరింగ్‌ రూములను ప్రారంభించి ప్రయాణికులకు అం దుబాటులోకి తెచ్చారు. ఈ రిటైరింగ్‌ రూముల్లో స్నానాల గదులు, తాగునీరు, మంచాలు, దుప్పట్లు, టీవీ, న్యూస్‌పేపర్లు, ఈజీ చైర్స్, తదితర అన్ని సదుపాయాలు ఉం టాయి.

ప్రయాణికులు తమ అవసరాలు, ప్రయాణ సమయానికి అనుగుణంగా గంటల ప్రాతిపదికన చార్జీలు చెల్లించి ఈ విశ్రాంతి గదుల్లో బస చేయవచ్చు.  ఇప్పటి వరకు ప్రతి 12 గంటలు, 24 గంటల చొప్పున చార్జీలు విధిస్తుండగా ఐఆర్‌సీటీసీ నిర్వహించే విశ్రాంతి గదుల్లో మాత్రం గంటల ప్రాతిపదికపై చార్జీలు వసూలు చేస్తారు. ప్రయాణికులు ప్రయాణంతోపాటే రిటైరింగ్‌ రూమ్‌ను బుక్‌ చేసుకోవచ్చు.  కాచిగూడ స్టేషన్‌లో దిగిన తరువాత నేరుగా వెళ్లి బుక్‌ చేసుకోవచ్చు. రిటైరింగ్‌ రూమ్‌ బుక్‌ చేసుకొనే వారు తమ ప్రయాణ టికెట్‌ను సంబంధిత అధికారులకు చూపించవలసి ఉంటుంది.  

మరిన్ని వార్తలు