‘బీమా’లో ధీమా లేదు: గవర్నర్

20 Apr, 2015 00:55 IST|Sakshi
ఐఆర్‌డీఏఐ వార్షికోత్సవంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్

ఇన్సూరెన్స్ రిటర్న్స్‌పై సన్నగిల్లుతున్న నమ్మకం
ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం సున్నా
ఐఆర్‌డీఏఐ వార్షికోత్సవంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్

సాక్షి, హైదరాబాద్: పాలసీదారులకు సులభంగా క్లెయిమ్స్ అందుతాయన్న ధీమా లేదని, ఇది మొత్తం బీమా వ్యవస్థపైనే అపనమ్మకం కలిగిస్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. మరీ ముఖ్యంగా పంటల బీమా ఒక ప్రహసనంగా మారిందని, పంట నష్టం సమయంలో రైతులకు పరిహారం అందడం లేదని విచారం వ్యక్తం చేశారు.

క్లెయిమ్‌ల చెల్లింపులో ఇన్సూరెన్స్ కంపెనీల అతితెలివిని అరికట్టి పాలసీదారుల ప్రయోజనాలను కాపాడాలని భారత ఇన్సూరెన్స్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ)కి గవర్నర్ సూచించారు. ఐఆర్‌డీఏఐ 16వ వార్షికోత్సవం, బీమా అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో నరసింహన్ మాట్లాడారు. పంటలు, మానవ బీమాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీమా కంపెనీలు ప్రీమియం కట్టించుకునే సమయంలో పాలసీదారులను ఊహలలో ఓలలాడించి తీరా క్లెయిమ్స్ చెల్లింపు సమయంలో ముఖం చాటేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన వ్యక్తికి ఇన్సూరెన్స్ ఇప్పించేందుకు తానే స్వయంగా అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం దగ్గరికి వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇక సాధారణ పాలసీదారుల సంగతి ఏంటని ప్రశ్నించారు. బీమా కోసం రైతులు పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు.

ఇలాంటి పరిణామాలు బీమా వ్యవస్థపైనే అపనమ్మకం పెంచుతున్నాయని చెప్పారు. బీమా పాలసీల నిర్వహణ మరింత సరళతరం చేసి పారదర్శకంగా చెల్లింపులు చేసే పరిస్థితి నెలకొల్పాల్సిన బాధ్యత ఐఆర్‌డీఏఐపై ఉందన్నారు. ఇన్సూరెన్స్ వయో పరిమితి పెంచి సీనియర్ సిటిజన్స్‌కు కూడా జీవిత, ఆరోగ్య బీమా కల్పించడంతోపాటు, పాలసీదారుడు బతికి ఉండగానే రిటర్న్స్ చెల్లించేలా విధానాలుండాలని సూచించారు.

బోగస్ బీమా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీన్ని నియంత్రించాలని చెప్పారు.ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. సదస్సులో ఐర్‌డీఏఐ చైర్మన్ టీఎస్. విజయన్‌తోపాటు ఉన్నతాధికారులు డిడి సింగ్, పౌర్ణిమగుప్తే పాల్గొన్నారు. పాలసీదారులకు అవగాహన కల్పిస్తూ ఐఆర్‌డీఏఐ రూపొందించిన పలు ప్రచురణలు, ప్రసార ప్రకటనలు గవర్నర్ ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు