రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు 

20 Dec, 2018 01:27 IST|Sakshi

     ఏపీలో వజ్రాల గనులు

     గుర్తించిన జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇనుప ఖనిజ నిక్షేపాల ఆనవాళ్లను గుర్తించినట్లు జియోగ్రాఫికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వజ్రపు గనుల ఆనవాళ్లను గుర్తించినట్లు జీఎస్‌ఐ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.శ్రీధర్‌ తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రగతిలో తమ శాఖ పలు కీలక ఆవిష్కరణలు చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ పలు ఖనిజ నిక్షేపాలను గుర్తించిందన్నారు. ఈ మేరకు 2016–17 సంవత్సరానికి సంబంధించి నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు.

తెలంగాణలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలను తాము సర్వే ద్వారా గుర్తించామన్నారు. ఇవి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆర్నకోండ ఎర్రబాలి బ్లాక్, చందోలి, అంబారీపేట బ్లాకులు, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని రబ్బనపల్లి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని గురిమల్ల, దబ్రీపేట, అబ్బాపూర్, మల్లంపల్లిలో 89.22 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలను తాము కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఇక్కడే ఇనుము తయారీలో వాడే ముడి మాగ్నటైట్‌ నిక్షేపాలు సైతం ఉన్నాయని తెలిపారు. అయితే వీటితో నాణ్యమైన స్టీలును తయారు చేయలేమని చెప్పారు. కానీ వీటిని చిన్న చిన్న ఐరన్‌ పెల్లెట్ల తయారీకి వినియోగించవచ్చని తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన బయ్యారం స్టీలు ఫ్యాక్టరీకి ఈ నిక్షేపాలు ఊతంగా నిలుస్తాయని అన్నారు. దీంతో బయ్యారం స్టీలు ఫ్యాక్టరీపై పోరాడుతున్న ప్రభుత్వానికి ఇది మంచి పరిణామమని ఆయన అభివర్ణించారు. 

ఆంధ్రాలో వజ్రపు నిక్షేపాలు.. 
అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల ముడి వజ్రపు నిక్షేపాల ఆనవాళ్లు (కింబర్లేట్‌ పైప్‌)ను కనుగొన్నట్లు తెలిపారు. వీటిని శుద్ధి చేసి ఒక క్యారెట్‌ నాణ్యతగల వజ్రాలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. 

మరిన్ని వార్తలు