ఆధార్‌ కేంద్రాల రహస్య దందా!

8 Jan, 2020 09:30 IST|Sakshi

జిల్లాలోని ఆధార్‌ కేంద్రాలు అక్రమాలకు అడ్డాలుగా మారాయి. నిర్దేశిత కేంద్రాల్లోనే పని చేయాల్సిన ఆయా సెంటర్లు అడవులకూ తరలుతున్నాయి.. అడ్రస్‌ లేని ఇళ్లకు వెళ్లి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి.. కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు.. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని రూ.వేలల్లో వసూలు చేస్తూ బెదరగొడుతున్నారు.    

సాక్షి, ఇందూరు: జిల్లాలోని ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బీడీ కార్మికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ వివరాలను మార్పిడి చేస్తూ ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూల్‌ చేసి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. బీడీ కార్ఖానా నిర్వాహకులతో చేతులు కలిపి ‘మాఫియా’గా తయారై రహస్యంగా ఈ అక్రమ దందాను సాగిస్తున్నారు. 

దళారులుగా మారి.. 
నిరక్ష్యరాస్యత, అవగాహన లేక చాలా మంది బీడీ కార్మికులు తమ పీఎఫ్‌ ఖాతాల్లో ఒకలా, ఆధార్‌లో మరోలా పుట్టిన తేదీ నమోదు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో పీఎఫ్‌ ఖాతాకు అనుగుణంగా ఆధార్‌లో పుట్టిన తేదీని మార్పు చేసుకోవాలని కార్ఖానా నిర్వహకులు, పీఎఫ్‌ అధికారులు చెబుతున్నారు. లేకపోతే పీఎఫ్‌ పింఛన్‌తో పాటు రాజీనామా చేసినప్పుడు డబ్బులు వచ్చే సమయంలో ఇబ్బందులు పడుతారని చెప్పడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు. ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, పేరు మార్చేందుకు తొలుత బీడీ కార్ఖానా నిర్వాహకులే దళారులుగా మారారు. తమకు తెలిసిన ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆధార్‌లో పుట్టిన తేదీ మార్చినందుకు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

అయితే, కార్ఖానా నిర్వాహకులు కూడా ఇదే అదనుగా అనుకుని బీడీ కారి్మకుల నుంచి పెద్ద మొత్తంలో గుంజుతున్నారు. పేరు, పుట్టిన తేదీ మార్పు కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు కారి్మకులు చెప్తున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో రూ.2 వేలు ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులకు ఇచ్చి, మిగతా డబ్బులు వారి జేబుల్లో వేసుకున్నట్లు తెలిసింది. ఇలా జిల్లా మొత్తంగా కొన్ని వేల మంది కారి్మకుల నుంచి ఆధార్, బీడీ కార్ఖానా నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. 

రహస్య ప్రాంతాల్లో..  
జిల్లా వ్యాప్తంగా 64 ఆధార్‌ కేంద్రాలు ఉన్నా, అందులో కొందరు నిర్వాహకులు మాత్రమే నిబబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లోనే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా తమకు తెలిసిన కార్ఖానా నిర్వాహకులతో చేతులు కలిపిన ఆయా కేంద్రాల నిర్వాహకులు.. రోజుకు కొంత మంది చొప్పున ఆటోల ద్వారా ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్‌పల్లి ప్రాంతాలకు తీసుకువచ్చి ఆధార్‌ కార్డుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే, ఆధార్‌ కేంద్రాల్లో చేస్తే విషయం బయటకు పొక్కుతుందని జాగ్రత్త పడిన ఆపరేటర్లు.. ఎవరికీ తెలియకుండా రహస్య ప్రాంతాలు, ఊరి చివరి ఇళ్లలో ఆధార్‌ కిట్లు పెట్టి నమోదు చేశారు. వాస్తవానికి కేంద్రాన్ని విడిచి ఆధార్‌ కిట్లు బయట ప్రాంతాలకు తీసుకెళ్లొద్దు.

కానీ కిట్లను బయట ప్రాంతాలకు తీసుకువచ్చి అటవీ ప్రాంతాల్లో నమోదు చేయడం గమనర్హం. బీడీ కార్మికులకు కూడా ఆటోలో ఎక్కడి తీసుకెళ్తున్నారో సమాచారం ఇవ్వడం లేదు. తీసుకెళ్లిన వారిని గదిలో పెట్టి బటయకు రాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఈ మ్‌గల్, ఆర్మూర్, నందిపేట్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి దందానే గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. ఈ  భైంసా నుంచి కూడా వచ్చి ఆధార్‌లో పుట్టిన తేదీని మార్చుకుని వెళ్తున్నారంటే మన జిల్లాలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

  • ఇరవై రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్‌లో గల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలోని ఆధార్‌ కేంద్ర నిర్వాహకులు ఆధార్‌ కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాల మార్పు కోసం బీడీ కారి్మకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచరంతో సంబంధిత అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఆధార్‌ కేంద్రాన్ని సీజ్‌ చేశారు. 
  • పెర్కిట్‌లో గల ఎస్‌బీఐ బ్యాంకు లో, ఐసీఐసీఐలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో అక్కడ పని చేసే ఆధార్‌ ఆపరేటర్‌ను మార్చేశారు. మరోసారి ఆరోపణలు వస్తే కేంద్రాన్ని సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు. 
  • అక్రమంగా తుప్రాన్‌ నుంచి జిల్లాకు వచ్చి పిప్రిలో బీడీ కారి్మకుల పుట్టిన తేదీని మా రుస్తుండగా అధికారులు పట్టుకు ని కేంద్రాన్ని సీజ్‌ చేయడమే కాకుండా దాదాపు రూ.50 వేల వరకు ఫైన్‌ వేశారు.  

తహసీల్‌ కార్యాలయాల పరిధిలో లేని కేంద్రాలు.. 
ఆధార్‌ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు మండల కేంద్రాల్లోని ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతున్న కేంద్రాలను ఆయా మండలాల తహసీల్దార్‌ కార్యాలయాలకు తరలించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను గతంలోనే ఆదేశించింది. కానీ జిల్లాలో 80 శాతం ఆధార్‌ కేంద్రాలు తహసీల్దార్‌ కార్యాలయాల పరిధిలోకి రాలేదు. వచ్చినా కొందరు వేరే కిట్లను గుట్టుచప్పుడు కాకుండా బయట ప్రాంతాల్లో వినియోగిస్తుండడం గమనార్హం.

అధికారుల పర్యవేక్షణ ‘మామూలే’..
ఆధార్‌ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఆధార్‌ కిట్లను బయట ప్రాంతాలకు తీసుకెళ్తున్నా, బీడీ కారి్మకుల ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీ వివరాలు మార్చుతున్నా తహసీల్దార్లు ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులకు ఈ విషయం తెలిసినా ఫిర్యాదులు వచ్చినప్పుడే హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులకు ఆధార్‌ నిర్వాహకులు ముడుపులు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారని తెలిసింది. జిల్లా కేంద్రంలోని ఓ అధికారికి కూడా ఆధార్‌ కేంద్రాల నుంచి మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఆధార్‌ కేంద్రాల నిర్వాహకుల కంప్యూటర్లలో ఆధార్‌ నమోదు వివరాలను పరిశీలించి చూస్తే బాగోతం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. 

చర్యలు తప్పవు.. 
బీడీ కారి్మకుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసి ఆధార్‌ కార్డుల్లో పుట్టిన తేదీలను మార్చుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఒకటి, రెండు కేంద్రాలను సీజ్‌ చేశాం. మరికొందరిని హెచ్చరించాం. అడ్డదారులు తొక్కి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. 
– కార్తిక్, ఈ–డిస్ట్రిక్ట్‌ మేనేజర్, నిజామాబాద్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా