కడతేర్చడమే ముగింపా?

18 Dec, 2019 08:34 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: హత్యకు గురైన అమూల్‌ కొమ్మావార్‌ను భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఇదివరకు ఆదిలాబాద్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు కింద రిమాండ్‌కు కూడా తరలించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అమూల్‌ తన శైలిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇతనిపై ఆదిలాబాద్‌ వన్‌టౌన్, టూటౌన్‌లోనూ చీటింగ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో నిందితులైనటువంటి అన్నదమ్ముళ్లపై గతంలో వివిధ గొడవలకు సంబంధించి కేసులు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక విధంగా నేర ప్రవృత్తి వైపు పయనించిందనేది ఇలాంటి సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని తంతోలి గ్రామంలో ఓ అసైన్డ్‌ భూమిని ఓ రియల్టర్‌ వెంచర్‌గా తయారు చేసి రూ.70వేల నుంచి రూ.80వేలతో ఏడేళ్ల క్రితం విక్రయించాడు. ఆ ప్లాట్‌ మార్కెట్లో రూ.5లక్షల వరకు ఉండడంతో జనాలు తక్కువ ధరకే ప్లాటు వస్తుందని మరో ఆలోచన చేయకుండా కొనుగోలు చేశారు. ఆ తర్వాత అది అసైన్డ్‌ భూమి అని తెలియడంతో లబోదిబోమన్నారు.

ఈ రియల్‌ వ్యాపారంలో హత్యకు గురైన అమూల్‌ కొమ్మవార్‌ కూడా భాగస్వామి. అంకోలి గ్రామంలోనూ ఇలాంటి ప్లాట్ల విక్రయాలు జరిపారు. ఆదిలాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తలెత్తిన విభేదాల కారణంగా హత్యకు దారి తీసినటువంటి పరిణామాలు ఇదివరకు కూడా జరిగాయి. 2012లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంజయ్‌ ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా మామడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై సెల్‌ సిగ్నల్‌ లేని ప్రాంతంలో కారును నిలిపివేసి హత్య చేశారు. ఈ సంఘటన అప్పట్లో ఆదిలాబాద్‌లో సంచలనం సృష్టించింది. పట్టణంలో కొంతమంది బడా రియల్టర్లతో కలిసి వ్యాపారం చేసే సంజయ్‌కి వారితో పడకపోవడంతోనే కడతేర్చారనే ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ అమూల్‌ హత్యతో ఆదిలాబాద్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థిరాస్తి వ్యాపారంలో తలెత్తుతున్న విభేదాలు, మోసాల కారణంగా కొంతమంది వ్యక్తులను కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదనేది ఈ రెండు సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఆదిలాబాద్‌లో ఈ సంఘటనతో పలువురు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, మధ్యవర్తుల్లో ఒకవిధమైన ఆందోళన మొదలైంది.

హత్యకు గురైన అమూల్‌ ఎన్నో ఏళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నాడు. అతనికి బేలలో కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లోనూ ఆస్తులు దండిగానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాపారంలో బోగస్‌ పత్రాలను సృష్టించి ప్లాట్లను విక్రయించడం, ఒక ప్లాట్‌ను పలువురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించడం, వెంచర్లలో కొంత భాగస్వామ్యం పెట్టి ఆ భూముల ధరలను మధ్యవర్తులతో కలిసి హద్దుమీరి పెంచి అమ్మడం, ప్లాట్ల విక్రయాల తర్వాత దాంట్లో మోసపోయిన బాధితులు ఇటు బ్రోకర్లను నిలదీయడం వంటి సంఘటనలు జరుగుతూ వచ్చాయి. నిందితులైన అన్నదమ్ముళ్ల తండ్రితో కలిసి అమూల్‌ స్థిరాస్తి వ్యాపారం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంట్లో పైన పేర్కొన్నటువంటి మోసాల కారణంగా బాధితులు నిందితుల ఇంటికి వచ్చి నిలదీయడం, డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేయడం వంటి విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఆ అన్నదమ్ముళ్ల తండ్రి మానసిక ఒత్తిడి కారణంగా పక్షవాతానికి గురై మంచానికే పరిమితం కావడం, మరోవైపు భూముల బాధితులు డబ్బుల కోసం ఇంటికి వస్తుండడం, దీనిపై అమూల్‌ను నిలదీసినప్పటికీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు.

అసైన్డ్‌ భూములను వెంచర్లుగా తయారు చేస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ఒకే ప్లాట్‌ను అనేక మంది పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడంలో రిజిస్టర్‌ అధికారుల తప్పిదమా.. లేనిపక్షంలో రియల్టర్ల ఎత్తుగడతో ఇవన్ని జరుగుతున్నాయా? అనేది స్పష్టం కావాల్సి ఉంది.  మరోపక్క పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మధ్యవర్తులు భూతగాదాలకు సంబంధించి చీటింగ్‌ కేసులు నమోదై జైలు కూడు తిని తిరిగి వచ్చాక కూడా ఇదే తంతు కొనసాగిస్తునప్పుడు వారిపై దృష్టి సారించకపోవడం పోలీసు వైఫల్యమా.. మొత్తం మీదా వ్యవస్థ లోపాలతో వ్యక్తి హత్యే పరిష్కారంవైపు పయనించిందనేది స్పష్టమవుతోంది. 

పేరు ప్రమోద్‌కుమార్‌ ఖత్రి. ఆదిలాబాద్‌ పట్టణంలోని భుక్తాపూర్‌లో నివసిస్తున్నాడు. తన మిత్రుడు యోగేశ్‌కు సంబంధించి పట్టణంలోని దస్నాపూర్‌ ప్రాంతంలో విలువైన ఓపెన్‌ ప్లాట్‌ ఉంది. ఇటీవల తన స్నేహితుడు ఆ ప్లాట్‌ను అమ్మేందుకు రిజిస్టర్‌ కార్యాలయంలో ఈసీ తీయించగా ప్లాట్‌ అతనిపేరు మీదే ఉన్నట్టు వచ్చింది. అయితే దాని రిజిస్ట్రేషన్‌ మాత్రం మరొక వ్యక్తి పేరిట ఉన్నట్లు రావడంతో ఖంగుతిన్నాడు. లక్షల రూపాయల విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో స్వాహా చేశారు. ఆదిలాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలని ప్రమోద్‌ కోరాడు. 

ఇరువురిపై కేసులున్నాయి
ఆదిలాబాద్‌లో హత్యకు గురైన అమూల్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితులైన అన్నదమ్ములిద్దరిని రిమాండ్‌కు తరలించాం. గతంలో అమూల్‌పై చీటింగ్‌ కేసులు ఉన్నాయి. వాటి వివరాలు సేకరిస్తున్నాం. అలాగే హత్య చేసిన అన్నదమ్ముళ్లపై కూడా గొడవలకు సంబంధించి ఒకట్రెండు కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. భూ వివాదాలకు సంబంధించి రెవెన్యూపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.      
- విష్ణు ఎస్‌.వారియర్, ఎస్పీ 

మరిన్ని వార్తలు