‘ఆడిట్‌’ ‘భ్రాంతియేనా!?

22 Oct, 2019 10:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్రమాల వెలికితీత అసాధ్యమేనా?

పంచాయతీల్లో తూతూమంత్రంగా ఆడిట్‌ 

మొక్కుబడిగా రికార్డుల పరిశీలన 

ప్రజాధనం దుర్వినియోగానికి ‘చెక్‌’ పెట్టాల్సిన ఆడిట్‌ శాఖ.. మొక్కుబడి తనిఖీలతో ఆ పాపంలో తనూ భాగమవుతోంది. ప్రభుత్వ శాఖలు, సంస్థల ఆదాయ, వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన వారే.. వృత్తిధర్మాన్ని తాకట్టుపెడుతుండడంతో అక్రమాలు వెలుగు చూడడం లేదు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడం లేదు. 

సాక్షి, కామారెడ్డి : ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విభాగాలు, స్థానిక సంస్థలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, దేవాలయాలు... ఇలా అన్నింటా ఏడాదిలో జరిగిన ఆదాయ, వ్యయాల లెక్కలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించడాని కి ఆడిట్‌ నిర్వహిస్తారు. అయితే కొందరు ఆడిట్‌ ఇటీవల పిట్లం మండలం చిల్లర్గి పంచాయతీలో 2018–19 సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ నిర్వహించారు. గ్రామస్తులు గ్రామంలో ఇంటి పన్నుల వసూళ్లలో అనేక అక్రమాలు జరిగినట్టు ఆడిట్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇళ్ల యజమానులు పలువురు తమ వద్ద ఉన్న రశీదులను అందించారు. వాటిని, పంచాయతీ రికార్డుల్లో ఉన్న డూప్లికేట్‌ రశీదులను పరిశీలిస్తే వసూలు చేసిన మొత్తంలో భారీ తేడా ఉన్నట్టు తేలింది.

అక్కడ లభ్యమైన రశీదుల ఆధారంగా అప్పటి కార్యదర్శి దాదాపు రూ. లక్ష పైనే అదనంగా వసూలు చేసినట్టు స్పష్టమైంది. గ్రామంలో మరింత లోతుగా పరిశీలన జరిపితే రూ. అరకోటికిపైగా అక్రమ వసూళ్లు జరిగినట్టు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆడిట్‌ జిల్లా అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కలెక్టర్‌ డీపీవోను ఆదేశించారు. కాగా చిల్లర్గి పంచాయతీలో అక్రమాలకు సంబంధించిన రశీదులు అంతకుముందు సంవత్సరాలవి అంటే 2015, 2017 సంవత్సరాలకు సంబంధించినవి కావడం గమనార్హం. ఆ రెండు సంవత్సరాల్లోనూ ఆడిట్‌ జరిగింది. అప్పట్లో ఆడిట్‌కు వెళ్లిన సిబ్బంది రికార్డులను తూతూమంత్రంగా పరిశీలించడం మూలంగా అక్రమాలు వెల్లడి కాలేదని స్పష్టమవుతోంది. అధికారులు, సిబ్బంది అమ్యామ్యాలకు ఆశపడి అక్రమార్కులకు తలొగ్గుతున్నారు. తప్పుడు లెక్కలు రాసుకుని డబ్బులు జేబుల్లో వేసుకున్న వారు ఇచ్చే సొమ్ముకు ఆశపడి నామమాత్రంగా ఆడిట్‌ నిర్వహించి, ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదికలు ఇస్తున్నారు. ఫలితంగా ఎన్నో అక్రమాలు వెలుగుచూడడం లేదు.  

మొక్కుబడి తనిఖీలు 
జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల లెక్కలు ఈ ఏడాది చివరికల్లా తేల్చాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వందలోపు పంచాయతీల్లోనే ఆడిట్‌ నిర్వహించినట్లు తెలిసింది. ఆడిట్‌ అధికారులు, సిబ్బంది ఒక్క పంచాయతీలే కాకుండా మున్సిపాలిటీలు, దేవాలయాలు, మండల, జిల్లా పరిషత్‌లు... ఇలా ఎన్నో శాఖల్లో ఆడిట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు 20 శాతం కూడా జరగలేదని సమాచారం. అంటే వందలోపు పంచాయతీల ఆడిటింగ్‌ మాత్రమే పూర్తవగా.. మిగతా 4 వందల పైచిలుకు పంచాయతీల ఆడిట్‌ను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలి. అంటే రెండు నెలల్లో నాలుగు వందల పంచాయతీల ఆడిటింగ్‌ ఎలా పూర్తవుతుందో అధికారులకే తెలియాలి. ఇటీవల ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆడిట్‌ అధికారులు, సిబ్బందికి ఆర్టీసీలో విధులు అప్పగించారు. దీంతో వారు ఆడిట్‌ పనులను పక్కన పెట్టేసి ఆర్టీసీ విధుల్లో కొనసాగుతున్నారు. మిగిలిన రెండు నెలల కాలంలో అన్ని పంచాయతీల ఆడిట్‌ సాధ్యమా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.  

మమ అనిపించాల్సిందే.... 
ఉన్న తక్కువ సమయంలో అన్ని పంచాయతీలలో ఆడిట్‌ పూర్తి చేయడం కష్టం. కాగా ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో ఆడిట్‌ అనేది చివరి సమయంలోనే పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. చివరి సమయంలో పంచాయతీ సిబ్బంది, ఆడిట్‌ సిబ్బందితో మాట్లాడుకోవడం, అన్నింటికీ ఓకే కొట్టేయడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆడిట్‌ అంటే అన్ని రకాల రికార్డులను పరిశీలించాలి. కానీ ఫైనల్‌ రిపోర్టును చూసి ఓకే చెప్పడం ద్వారా అక్రమాలు వెలుగు చూసే పరిస్థితి లేకుండాపోయింది. ఆడిట్‌ శాఖలో కొందరు సీనియర్లు ముందస్తుగా పంచాయతీ అధికారులు, సిబ్బందితో మాట్లాడుకుని ఆడిట్‌ మమ అనిపిస్తారనే ప్రచారం ఉంది. ఇప్పటికైనా కంచె చేను మేసిన చందం కాకుండా పూర్తి స్థాయిలో ఆడిట్‌ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమాలకు ఆస్కారం లేదు 
ఆడిట్‌ పకడ్బందీగానే నిర్వహిస్తున్నాం. ఇటీ వల చిల్లర్గి పంచాయతీలో పన్నుల వసూళ్ల వ్యవహారంలో మా సిబ్బందికి వచ్చిన ఫి ర్యాదులను క్రోడీకరించి అక్రమాలు జరిగినట్టు నిర్ధారించుకుని కలెక్టర్‌కు, జిల్లా పం చాయతీ అధికారికి నివేదిక పంపించాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీపీవో విచారణ జ రుపుతారు. అయితే పంచాయతీల్లో మొక్కు బడి విచారణ అనేది ఉండదు. రికార్డులన్నింటినీ పరిశీలిస్తాం. అక్రమాలకు ఆస్కా రం లేదు.
–వెంకటేశం, జిల్లా ఆడిట్‌ అధికారి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా