సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు నిజమే

6 Dec, 2017 03:17 IST|Sakshi

విచారణకు ఆదేశించిన గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి

సాక్షి, మహబూబాబాద్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గతేడాది జరిగిన కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్‌ (సీఆర్‌టీ) నియామకాల్లో అక్రమాలు జరగడం వాస్తవమేనని గుర్తించారు. ‘సాక్షి’ దినపత్రికలో గత నెల 30న ‘సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బెన్హర్‌ మహేష్‌దత్‌ ఎక్కా స్పందించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లను విచారణకు ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీనా జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణను విచారణకు పంపారు.

ఆయన ఆశ్రమ పాఠశాలలను సందర్శించి వివరాలు సేకరించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17కిగానూ 48మంది అభ్యర్థులను సీఆర్‌టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా కలెక్టర్‌ అప్రూవల్‌ తీసుకోకుండా అడ్డదారుల్లో  వారిని నియమించారనేది ఆరోపణ. జిల్లాలో పనిచేస్తున్న ఓ సహాయ గిరిజనాభివృద్ధి అధికారి ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో ఐదుగురు ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండానే నియామకమైనట్లు గుర్తించినట్టు సమాచారం. 

>
మరిన్ని వార్తలు