డీల్‌ కుదిరింది.. సీన్‌ మారింది!

12 Feb, 2020 08:54 IST|Sakshi

నారాయణపేట జిల్లా ఊట్కూరులో ప్రభుత్వ భూ బదలాయింపు వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. 21.81 ఎకరాల సర్కారు స్థలాన్ని తమ కుటుంబీకులు, బంధువుల పేరు మీద పట్టా చేసి అడ్డంగా దొరికిపోయిన ఓ వీఆర్వో, ముగ్గురు వీఆర్‌ఏలను కాపాడేందుకు ఓ అధికారి వారితో డీల్‌ కుదుర్చుకున్నారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అందుకోసం సదరు అధికారి ఓ ఉద్యోగిని మధ్యవర్తిగా నియమించుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్యవర్తి సదరు అధికారికి, ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఉద్యోగుల మధ్య ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే మండలంలో చర్చనీయాంశమైన భూ అక్రమ వ్యవహారాన్ని సదరు అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

సాక్షి, మహబూబ్‌నగర్‌: భూ అక్రమ బదలాయింపుపై ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడం.. దీనిపై కలెక్టర్‌ హరిచందన దాసరి ప్రత్యేక దృష్టి సారించడంతో తనను నమ్ముకున్న ఉద్యోగులను కాపాడేందుకు ఓ అధికారి తర్జనభర్జన పడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తనకున్న అధికారంతో వీఆర్‌ఏలు రాజప్ప, భీంరావు, బాపూర్‌ వీఆర్‌ఏ జ్యోతిను సస్పెండ్‌ చేసిన తహసీల్దార్‌ దానయ్య.. తన పరిధిలో లేకపోవడంతో వీఆర్వో భూమయ్యను సస్పెండ్‌ చేయలేదు. కానీ.. వీఆర్వోపై నివేదిక సిద్ధం చేసి ఆర్డీఓకు పంపాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం వరకూ సదరు తహసీల్దార్‌ నివేదికను సిద్ధం చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూమయ్యపై నివేదిక పంపించాల్సిన తహసీల్దార్‌ ఇంత వరకు తనకు పంపలేదని.. అందుకే సస్పెండ్‌ చేయలేదని నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్‌ చెప్పడం గమనార్హం. 

ఇక్కడా అదే తీరు.. 
కేవలం 21.81 ఎకరాలే కాదూ.. అదే మండలంలోని బాపూర్‌లో అన్యాక్రాంతమైన సుమారు 75 ఎకరాల ప్రభుత్వ స్థలం విషయంలోనూ సదరు అధికారి అదే తీరుగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రెవెన్యూ ఉద్యోగి ఒకరు బాపూర్‌లో ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట అక్రమ పట్టాలు చేశారంటూ గ్రామానికి చెందిన రాఘవారెడ్డి అనే రైతు పలువురు గ్రామస్తులతో కలిసి జూన్‌ 11, 2018లోనే అప్పటి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ భూములకు సంబంధించిన విచారణలో ఎలాంటి పురోగతి లేదు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసలు ఆ గ్రామంలో భూ అక్రమాలపై విచారణ జరిగిందా? లేదా? జరిగితే అధికారుల విచారణలో ఏం తేలింది? విచారణాధికారులు ఉన్నతాధికారులకు ఏం నివేదిక ఇచ్చారు? అనే ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి.

మరోవైపు 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఇతరుల పేరిట పట్టా అయినట్లు గ్రామస్తులు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో గ్రామస్తులు నిజం చెబుతున్నారా? లేక గతంలో విచారణ చేపట్టిన అధికారులు తమ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారా? అనేది జిల్లా కలెక్టర్‌ దృష్టిసారిస్తేనే నిగ్గు తేలుతుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. పునర్విచారణ చేపడితేనే తప్ప సదరు అవినీతి అధికారి బండారం బయటపడని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ హరిచందన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ జోరుగా జరుగుతోంది.   

మరిన్ని వార్తలు