అ‘ధనం’

29 Apr, 2015 00:57 IST|Sakshi
అ‘ధనం’

పాత పనులకు అదనపు కేటాయింపులు  రెట్టింపు ప్రతిపాదనలతో నిధులు మంజూరు
పూర్తయిన పనులకు పెరుగుతున్న నిధులు  చెక్‌డ్యాంల నిర్మాణంలో అక్రమాలు
 

మిషన్ మర్మం  5

 మద్దూరు మండలం దూల్మిట్లలో పెద్దవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2011 జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3.12 కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంది. 2015 జనవరి 1న అధికారులు కొత్తగా రూపొందించారు. నిర్మాణం         వ్య యం అంచనాను రూ.55.48 లక్షలు పెంచాలని ప్రతిపాదించారు. పెరిగిన అంచనా మేరకు చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.3.67 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 25న ఉత్తర్వులు జారీ చేసిం ది. ఏడాది క్రితం దీని నిర్మాణం పూర్తయ్యింది. అయినా దీని నిర్మాణం అంచనాలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
 
కొడకండ్ల మండలం ఏడునూతలలోని పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం రూ.67 లక్షలు మంజూరు చేస్తూ 2012 సెప్టెంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు పునరుద్ధరణ చేయకుండా కేవలం గండ్లు పూడ్చి సరిపెట్టారు. ఇదే చెరువు పునరుద్ధరణ కోసం రూ.3.82 కోట్లు అవసరమవుతాయని చిన్ననీటి పారుదల శాఖ తాజాగా అంచనాలు వేసింది. 2015 జనవరి 13న పెరిగిన అంచనాలతో ప్రభుత్వానికి నివేదించింది. మిషన్ కాకతీయ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంతే మొత్తాన్ని మంజూరు చేస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం లక్షల రూపాయల్లో ఉన్న చెరువు పునరుద్ధరణ నిధులు ఇప్పుడు కోట్ల రూపాయలకు పెరగడం విమర్శలకు దారితీస్తోంది.
 

వచ్చిన పనులు చేయకుండా జాప్యం చేయడం.. పాత పనులనే అంచనాలు పెంచుకోవడం.. భారీగా ప్రభుత్వ నిధులు తీసుకోవడం చిన్ననీటి పారుదల శాఖలో జోరుగా జరుగుతోంది. అధికారులు-కాట్రాక్టర్ల మధ్య సమన్వయం బాగా ఉంది. పూర్తయిన పనులకు కూడా పెంచిన అంచనాలతో నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. అధికారులు పంపిన అంచనాల ఆధారంగా ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు విడుదల చేస్తోంది. మొత్తంగా నిర్మాణాల  అంచనాల వ్యయం భారీగా పెరుగుతోంది. జిల్లాలో మూడు నెలలుగా ఇది ఎక్కువగా జరుగుతోంది. చిన్ననీటి పారుదల శాఖలోని చెక్‌డ్యాం నిర్మాణాల కోసం గతంలో మంజూరు చేసిన నిధులకు రెట్టింపు స్థాయిలో కేటాయిస్తూ వరుసగా ఉత్తర్వులు వస్తున్నాయి. కాంట్రాక్టర్లను మెప్పించేందుకు అంచనాలను పెంచుతున్న అధికారులు పనుల నాణ్యతను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల వద్ద చలివాగుపై ఆనకట్ట నిర్మాణం కోసం రూ.2.26 కోట్లు మంజూరు చేస్తూ 2008 సెప్టెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 జూన్‌లో ఈ ఆనకట్ట నిర్మాణం అంచనాలను పెంచారు. అప్పుడు పెంచిన అంచనాల మేరకు పనులు చేశారు. నిర్మాణం పూర్తి కావడంతో 2013లో అప్పటి ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఆనకట్టకు అదనపు నిర్మాణ వ్యయం అయ్యిందనే కారణంతో అంచనాలు పెంచారు. ఏకంగా రూ.5.72 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఆనకట్టకు ముందు నీటి నిల్వ కోసం లోతుగా ఉండాల్సిన ప్రదేశం మొత్తం ఇసుక మేటతో నిండింది. ఇక్కడ నీరు ఆగే పరిస్థితి లేదు. ఇలాంటి నిర్మాణానికి మళ్లీ నిధులను పెంచారు.

జనగామ నియోజకవర్గం మ ద్దూరు మండలం గాగిల్లాపూర్-లింగాపూర్ మధ్యలో పెద్ద వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం గతేడాది పూర్తయింది. నిర్మాణం పూర్తయిన ఈ చెక్‌డ్యాం కోసం అంచనాలు పెంచారు. 2009 జూన్ 9న ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. రూ. 2.34 కోట్లతో ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంది. 2014 మార్చి 3న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఈ చెక్‌డ్యాం నిర్మాణ వ్యయాన్ని పెంచారు. పెరిగిన అంచనాల మేరకు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. మళ్లీ 2014 నవంబర్ 17న ఉన్నతాధికారులు పెరిగిన అంచనాలను ఖరారు చేశారు. తాజాగా ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.2.73 కోట్లకు పెంచుతూ ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కల్లెడలో ఆకేరు వాగు పై చెక్ డ్యాం ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చిం ది. దీని నిర్మాణం కోసం రూ.45.90 లక్షలు మంజూ రు చేస్తూ 2006 నవంబరు 24న ఉత్తర్వు లు జారీ చేసింది. కాంట్రాక్టరు పనులు చేయకుండా జాప్యం చేశాడు. తర్వాత అంచనాలు పెంచే విధంగా రాజకీయంగా ఒత్తిడి తెచ్చాడు. కాంట్రాక్టరు సూచన మేరకు అధికారులు 2014 ఫిబ్రవరిలో కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదలనపై ఉన్నతాధికారులు అదే ఏడాది మార్చి 6న కొత్త ఆదేశాలు వచ్చాయి. చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.2.46 కోట్లను మంజూరు చేశారు. హడావుడిగా ఎన్నికలకు ముందు పనులు ప్రారంభించారు. కాంట్రాక్టరు మళ్లీ పనులు జరపలేదు. అధికారులు తాజాగా మళ్లీ ప్రభుత్వానికి అంచానలపై ప్రతిపాదనలు పంపారు. అదే మొత్తానికి పనులు చేసేలా 2015 ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారీగా అంచనా వ్యయం పెంచిన అధికారులు పనుల నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
 

>
మరిన్ని వార్తలు