మాయాబజార్

13 May, 2015 02:58 IST|Sakshi

- సబ్సిడీ ‘మాయం'!
- రేషన్ సరుకు.. డీలర్ల కిటుకు
- నిత్యావసరాల పంపిణీలో అక్రమాలు
- బలవంతంగా ప్రైవేట్ సరుకుల విక్రయం
- డీలర్ చెప్పినట్టు వినకుంటే తంటాలే!

రేషన్ దుకాణాల్లో దోపిడీ ఎక్కువైంది. సరుకుల పంపిణీ అంతా మాయగా మారింది. ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల కంటే ప్రైవేట్ సరుకుల విక్రయంపైనే డీలర్లు ‘దృష్టి’ పెడుతున్నారు. ఇక, చిల్లర లేదంటూ చేతివాటమూ చూపుతున్నారు. వారు చెప్పిందానికి తలూపాల్సిందే.. లేదంటే కార్డు ఊడబీకేస్తామని బెదిరింపులు.. ఇంతటి దౌర్జన్యం కొనసాగుతోన్నా అడిగే దిక్కులేదు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎవరి పొట్లం వాళ్లకు ఇవ్వాలని ప్రభుత్వం రేషన్ సరుకులను డీలర్ల చేతితో పెడితే.. వాళ్లేమో పేదల పొట్టగొడుతున్నారు. ఆహార భద్రత సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఓపెన్ మార్కెట్‌లోని కల్తీ, నాసిరకం సరుకులు పట్టుకొచ్చి వాటిని నయానో భయానో తెల్లకార్డుదారులకు అంటగడుతున్నారు. ప్రైవేటు సరుకులు తీసుకోకపోతే డీలర్లు నోటిదురుసు చూపుతున్నారు. రేషన్ కార్డు రద్దవుతుందని బెదిరిస్తున్నారు.

నోరున్నోళ్లకే సరుకులు...
రాష్ట్ర ప్రభుత్వం వివిధ నిత్యావసర వస్తువులను డీలర్లకు పంపుతోంది. ఇవన్నీ కచ్చితంగా అందుకుంటున్న కుటుంబాలు 40 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. గ్రామ స్థాయిలోని చోటామోటా నేతల కుటుంబాలు, అక్రమాలను నిలదీసే వారికి మాత్రమే కచ్చితంగా అన్ని సరులకు అందిస్తున్నారు. ఇలాంటి వాళ్లు సమయానికి రాకపోయినా డీలర్లు వారి కోసం దాచిపెట్టి మరీ ఇస్తున్నారు. ఇక నిరుపేదలకైతే షాపు వద్ద సరుకుల సంగతి దేవుడెరుగు. కనీస గౌరవం కూడా దక్కడం లేదు. రేషన్ డీలర్లు మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. ఓపెన్ మార్కెట్‌లోని కల్తీ, నాసిరకం నూనెలు, సబ్బులు, సర్ఫ్‌లు, షాంపూలు తెచ్చి బలవంతంగా అంటగడుతున్నారు. స్టాక్ పాయిం ట్ నుంచి డీలర్ సరుకులు తీసుకొని నల్ల బజారుకు తరలించి, అక్కడి ఓపెన్ మార్కెట్ నుంచి నాసిరకం సరుకులు తెచ్చి అంట గట్టే వరకు సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి.

వెంటపడి అంటగడుతున్నారు..
ప్రతి కుటుంబానికి కిలో పామాయిల్ చొప్పున సరఫరా చే యాలి. కొంతకాలంగా ప్ర భుత్వం రేషన్ దుకాణాలకు ఠమొదటిపేజీ తరువాయి
సబ్సిడీ నూనెను సరఫరా చేయడం లేదు. డీలర్లు ప్రైవేట్ కంపెనీల నూనె ప్యాకెట్లను తెచ్చి అంటగడుతున్నారు. విజయ నూనె పేరుతో ఉన్న ప్యాకెట్లను డీలర్లు వినియోగదారులకు రూ.64కు ఇస్తున్నారు. కంపెనీ వీళ్లకు రూ.58కే టోకున ఇస్తుందట. నూనె ప్యాకెట్ మీద మాత్రం ఎమ్మార్పీ రూ.78 ఉండటం గమనార్హం. 250 గ్రాముల ఊర్వశి బట్టల సబ్బును ఎమ్మార్పీ రూ.10కి, 150 గ్రా. సంతూర్ సబ్బును ఎమ్మార్పీ రూ.24 ఉండగా రూ. 22కు, ఎక్సలెంట్ డిష్‌బార్ (250 గ్రాములు)ను రూ.40కి కార్డుదారులకు విక్రయిస్తున్నారు. ఇదీగాక రూపాయి, రెండు రూపాయలు చిల్లర లేదనే సాకుతో అగ్గిపెట్టెలు, పిప్పరమెంట్లు, బఠానీలతో సరిపెడుతున్నారు. డీలర్లు ఇచ్చిన సరుకులు తీసుకోకపోతే బియ్యం, చక్కెర ఇవ్వడం లేదు. కిరోసిన్ పోయడం లేదు.

రెండు, మూడు నెలల వరకు రేషన్ సరుకులు తీసుకపోకపోయినా డీలర్లు ఏమీ అనడం లేదు గాని ప్రైవేటు సరుకులు ఒక్క నెల తీసుకోకపోయినా బెదిరిస్తున్నారు. ప్రైవేటు సంస్థల సరుకులను వినియోగదారులకు అందజేయడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ సరుకులను అందించడంలో లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు నోరు మెదపటం లేదు. డీలర్ల అక్రమాలకే జై కొడుతున్నారు.

మరిన్ని వార్తలు