బోగస్‌

23 Sep, 2017 12:23 IST|Sakshi

ఫేక్‌ ఇంటర్వూ్యలు..నకిలీ సర్టిఫికెట్లు..

‘మైనారిటీ’ ఉద్యోగాల నియామకాల్లో చోద్యం

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అక్రమాలు

జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

ఏజెన్సీ ఎంపికలో నిబంధనలు గాలికి..

మైనారిటీ సంక్షేమశాఖలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో  అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దొడ్డిదారిన అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీకి చెందిన ఓ నిర్వాహకురాలు ఉద్యోగాలిప్పిస్తామంటూ బోగస్‌ ఇంటర్వూ్యలు నిర్వహించినట్లు తేలింది. జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 13న చీటింగ్‌ కేసు నమోదైంది. మునిపల్లిలోని గురుకులలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలకు బోగస్‌ ఇంటర్వూ్యలు నిర్వహించినట్లు గుర్తించారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ :
మైనారిటీ వర్గాలకు చెందిన చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మైనారిటీ గురుకులాను మంజూరు చేసిన విషయం విదితమే. అందులో భాగంగా జిల్లాలో 12 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాన్‌టీచింగ్‌ ఉద్యోగాల నిర్వహణకు సంబంధించి అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నియామకం విషయంలో నిబంధనలను గాలికొదిలేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ నియామకం కోసం ప్రత్యేకంగా టెండరు నోటిఫికేషన్‌ జారీ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించాలి. కానీ జిల్లా అధికార యంత్రాంగం ఈ నిబంధనలను తుంగలో తొక్కింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. టెండర్లు పిలవలేదు. ఆయా ఏజెన్సీల పనితీరును పరిశీలించి.. ఏజెన్సీని ఎంపిక చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు కలిసి ఈ ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం..
అడ్డగోలుగా జరిగిన  ఈ నియామకాలతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిగా  అన్యాయం జరిగింది. ఈ ఒక్కశాఖలోనే 96 ఉద్యోగాల భర్తీ అడ్డదారిలో జరగడంతో వీటి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. నాన్‌టీచింగ్‌ ఉద్యోగాలైన డాటాఎంట్రీ ఆపరేటర్లు, సెక్యురిటీగార్డులు, అటెండర్లు, హౌజ్‌కీపింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉండటంతో ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అధికారులు మాత్రం ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే వారిని ఈ ఉద్యోగాల్లో పెట్టుకున్నామంటూ చేతులెత్తేస్తున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు.. ఈ క్రమంలో అధికారులు అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఇన్‌చార్జి కలెక్టర్‌ సీరియస్‌..
డాటాఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు కొందరు అభ్యర్థులు బోగస్‌ స్టడీ సర్టిఫికెట్లు జతపరిచారు. అడ్రస్‌ లేని సంస్థల్లో కంప్యూటర్‌ కోర్సు చేసినట్లు.. పీజీ డీసీఏ సర్టిఫికెట్లు సృష్టించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమగ్ర విచారణకు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం వెనుకంజ వేస్తోంది. ఈ భర్తీ ప్రక్రియలో అక్రమాలు వెలుగుచూడటంతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఎ.రవీందర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు