‘రెవెన్యూ’లో బదిలీలలు

16 Nov, 2019 09:13 IST|Sakshi

జిల్లా కేంద్రంలోని ఓ తహసీల్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్‌ఐ విధుల నిర్వహణ చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. బదిలీ అనివార్యమని తెలవడంతో పావులు కదిపాడు. తనకున్న పరిచయంతో తహసీల్దార్‌తో కలెక్టర్‌ పరిపాలనా కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారికి ఫోన్‌ చేయించి ప్రస్తుతమున్న చోటే ఆర్‌ఐని కొనసాగించాలని, బదిలీ చేయవద్దని ఫోన్‌ చేయించాడు. ఈ విషయం ప్రస్తుతం బయటకు పొక్కడంతో రెవెన్యూ వర్గాల్లో చర్చగా మారింది. బదిలీల జాబితాలో ఉన్న ఈ ఒక్క ఆర్‌ఐయే కాదు... మరి కొందరు కూడా ఆశిస్తున్న ప్రాంతాలకు వెళ్లడానికి పైరవీలు చేసినట్లు విశ్వనీయ సమాచారం. 

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌): రెవెన్యూ శాఖలో త్వరలో భారీగా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎక్కువ కాలం ఒకే చోట పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పించడానికి జిల్లా కలెక్టర్‌ పరిపాలనా కార్యాలయం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా మండల తహసీల్‌ కార్యాలయాల్లో రెండు సంవత్సరాల పాటు పని చేస్తున్న వారిని గుర్తించి వారి బదిలీలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఫైలును రూపొందించారు. దాదాపు 16 మందికి పైగా ఆర్‌ఐలను ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల నుంచి వేరే మండలాలకు బదిలీ చేయడానికి మండలాలు కూడా ఖరారు కాగా, అప్రూవల్‌ కోసం సంబంధిత ఫైలు జిల్లా కలెక్టర్‌ వద్దకు వెళ్లింది.

అయితే సీసీఎల్‌ఏను మరోసారి సంప్రదించి ఫైలును నివేదించాలని కలెక్టర్‌ పరిపాలనా అధికారులకు సూచించారు. కలెక్టర్‌ సంతకమే తరువాయి కావడంతో మరో వారం రోజుల్లో బదిలీల ఉత్తర్వులు వెలుబడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బదిలీల ఫైలు రూపుదిద్దుకుంటున్న సందర్భంలోనే పలువురు ఆర్‌ఐలు పావులు కదిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశిస్తున్న మండలాలకు బదిలీ అయ్యేందుకు ఉన్నతాధికారుల సిఫార్సులు చేయించారని, మరి కొందరు పని చేస్తున్న స్థానంలోనే మరికొన్ని రోజులు కొనసాగేందుకు తమదైన రీతిలో పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్‌ఐల ఫైలు కలెక్టర్‌ వద్ద నిలిచిపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఆశించిన మండలాలు రాకపోతే ఎలా అని అంతర్మథనంలో పడ్డారు.

డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు... 
ఆర్‌ఐల బదిలీల పక్రియ పూర్తి కాగానే డిప్యూటీ తహసీల్దార్‌ బదిలీలు కూడా చేపట్టాలని కలెక్టర్‌ పరిపాలనా అధికారులు భావిస్తున్నారు. ఇందుకు జిలాల్లో ఎక్కువ కాలం అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు ఒకేచోట పని చేస్తున్న వారి వివరాలను సేకరించడానికి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 20 మంది వరకు డిప్యూటీ తహసీల్దార్‌లు బదిలీలకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఐల బదిలీలు కాగానే తమ బదిలీలే ఉంటాయని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్లు కూడా ఆశిస్తున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమకున్న బలంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు