‘నకిలీ’లపై క్రిమినల్‌ కేసులు!

18 Dec, 2017 02:07 IST|Sakshi

     దొంగ పాస్‌ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్న వారిపై చర్యలు

     భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా వెల్లడవుతున్న అక్రమాలు

     కఠినంగా వ్యవహరించాలని సర్కారు నిర్ణయం

     ప్రభుత్వ భూముల్లో కబ్జాలను వారికే అసైన్‌ చేసే అవకాశం

     మండల, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉంటే మాత్రం నో చాన్స్‌

     అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఉప సంఘం నివేదిక మేరకు తుది నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వెలుగులోకి వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న, ఇతర ప్రయోజనాలు పొందుతున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాలని, బ్యాంకుల సిఫార్సు ఆధారంగా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇక ప్రభుత్వం అసైన్‌ చేసిన భూముల్లో లబ్ధిదారులు కాకుండా.. వేరేవారు కబ్జాలో ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కానీ దీనిపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక కోసం ఎదురుచూస్తోంది. నివేదిక అందగానే కబ్జాలో ఉన్నవారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి వారికి మళ్లీ అసైన్‌ చేయా లని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే అసైన్డ్‌ భూముల చట్టంలో సవరణలు చేయనుంది. 

రుణాలు కడుతున్నారా..? 
భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా బయటపడుతున్న నకిలీ పాస్‌ పుస్తకాల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లేకుండానే పాస్‌ పుస్తకాలు సృష్టించి వందల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నట్లుగా ప్రక్షాళన సందర్భంగా బయటపడింది. ముఖ్యంగా నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో వేల ఎకరా ల భూముల పేరిట నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీటితో తీసుకున్న బ్యాంకు రుణా లను తిరిగి తీర్చేస్తున్నారా అన్న కోణంలో పరిశీలన జరపనుంది. ఇలా రుణాలు తీసుకున్న వారు చెల్లించని పక్షంలో బ్యాంకుల సిఫారసు మేరకు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 

మళ్లీ తెరపైకి జీవో నం 59 
గతంలో దరఖాస్తులు స్వీకరించిన భూముల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన నేపథ్యంలో.. ఆ దరఖాస్తుల పరిష్కారానికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 125 గజాలకుపైగా ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే వాటిని మార్కెట్‌ ధరతో క్రమబద్ధీకరించాలని 2014 డిసెంబర్‌లో జీవో నం 59 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో కూడా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. అసైన్డ్‌ భూముల్లో కబ్జాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రాంతాన్ని బట్టి మార్కెట్‌ ధర ఎక్కువగా ఉండటంతో నాలుగు విడతల్లో సొమ్ము చెల్లించే అవకాశం కల్పించింది. కానీ నిర్దేశిత గడువులోపు 1, 2 వాయిదాలు చెల్లించిన కొందరు.. మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయారు. దాంతో వారికి ఆ భూములను క్రమబద్ధీకరించలేదు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయలేదు. ఈ నేపథ్యంలో జీవో నం 59కి అనుగుణంగా అనుమతి పొంది పాక్షిక చెల్లింపులు చేసిన దరఖాస్తులకు మరో అవకాశం ఇవ్వాలని.. మిగతా సొమ్మును మరో ఏడాదిలోపు చెల్లించే వెసులుబాటు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.  

ప్రభుత్వ భూముల్లో కబ్జాలుంటే..
భూరికార్డుల ప్రక్షాళనలో వెలుగులోకి వస్తున్న మరో అంశం ప్రభుత్వ భూముల కబ్జా. రికార్డులు సరిగా లేకపోవడం, ప్రభుత్వ భూములపై పర్యవేక్షణ లేకపోవడం, కొందరు అక్రమార్కులు రెవెన్యూ వర్గాలతో చేతులు కలపడం వంటి కారణాలతో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అయినట్లు ప్రక్షాళనలో వెల్లడైంది. ఇలాంటి కబ్జాల్లో ఉన్న నివాసస్థలాలను వారి సామాజిక, ఆర్థిక హోదాను బట్టి వారికే కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మండల, జిల్లా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కబ్జాలను మాత్రం క్రమబద్ధీకరించ కూడదని ప్రభుత్వం భావిస్తోంది. విలువైన ఆ భూములను ప్రజావసరాలకు వినియోగించుకోవాలని.. పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థలు, ఇతర సమూహాల చేతుల్లో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. 

>
మరిన్ని వార్తలు