అసలెవరు.. నకిలీలెవరు ?

22 Oct, 2019 09:09 IST|Sakshi
వరంగల్‌ ఆర్వో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

న్యూశాయంపేటకు చెందిన ఓ వ్యక్తి తన 400 గజాల భూమిని అవసరాల నిమిత్తం విక్రయించేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదర్చుకుని బయానా తీసుకున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం తన కుటుంబసభ్యులు, కొనుగోలుకు అంగీకరించిన వ్యక్తితో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వస్తే ప్రతీరోజు నంబర్ల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నందున రేపు రావాలని ఉద్యోగులు సూచించారు. మరలా హైదరాబాద్‌ నుంచి కుటుంబం, కొనుగోలు చేసిన వ్యక్తితో కలిసి రాలేనని చెప్పినా అంగీకరించలేదు. ఇదంతా చూస్తున్న ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ తన కార్యాలయంలోకి తీసుకెళ్లి ‘నేను ఈ రోజే మీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తాను, నాకు రూ.10వేలు ఇవ్వండి’ అని చెప్పాడు. దీంతో ఆ డబ్బు ఇవ్వగా సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయించాడు.

హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి పలివేల్పులలోని 300 గజాల భూమిని కొనుగోలు చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు యజమానికి బయానా ఇచ్చేందుకు సిద్ధమైన ఆయన.. భూమి ఎవరికైనా ఇంతకు ముందే రిజిస్ట్రేషన్‌ అయిందా, లేక భూయజమాని పేరిటే ఉందా అనే సందేహంతో ఈసీ(ఎన్‌కంబర్స్‌మెంట్‌ సర్టిఫికెట్‌) కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చాడు. దీనికి ‘మీ సెల్‌ఫోన్‌లో టీఎస్‌ ఫోలియో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని చూడండి.. లేదంటే బయట ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లను కలవండి’ అనే సలహా కార్యాలయ సిబ్బంది నుంచి వచ్చింది. దీంతో బయట డాక్యుమెంట్‌ రైటర్‌ను కలవగా కార్యాలయానికి చెల్లించాల్సిన డబ్బుతో పాటు అదనంగా రూ.500 తీసుకుని క్షణాల్లో ఈసీ అందజేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని ఎక్కడి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో చూసినా బినామీలు, దళారుల హవానే కనిపిస్తోంది. అధికారులకు ఇదంతా తెలిసినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడం క్రయ, విక్రయదారులకు శాపంగా మారింది.

సాక్షి, వరంగల్‌ : స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అడుగుపెడితే.. అక్కడ ప్రైవేట్‌ వ్యక్తులెవరో, శాఖ ఉద్యోగులెవరో ఎంతటి ఘనులైనా కనుక్కోలేరు! కార్యాలయాల్లో హడావుడిగా తిరుగుతూ చకచకా పనులు చేస్తూ రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సబ్‌రిజిష్ట్రాలతో సంతకాలు పెట్టిస్తూ... ‘ఆజ్‌ నై.. కల్‌ ఆవో’ అంటూ ప్రజలపై పెత్తనం చేస్తూ.. పని కాగానే ‘పద్ధతి’ని పాటించాలంటూ బహిరంగంగానే అమ్యామ్యాలు డిమాండ్‌ చేసే వారిని చూడొచ్చు. ఇలాంటి వారిని మనం ప్రైవేట్‌ వ్యక్తులని ఎవరూ భావించం. విలువైన రికార్డుల గదుల్లోనూ అంతా తామై పనులు చక్కపెట్టే వీరి వ్యవహార తీరు అచ్చం శాఖ ఉద్యోగులను తలపిస్తుంది. అధికారులతో వీరు వ్యవహరించే పద్ధతిని పరిశీలిస్తే కూడా ఇదే అనిపిస్తుంది. కానీ ఎక్కువగా ప్రైవేట్‌ వ్యక్తులే ఇందులో ఉంటారు. అధికారుల అండదండలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తులు ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అన్ని విభాగాల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతుండటంతో ‘మూడు డాక్యుమెంట్లు... ఆరు రిజిస్ట్రేషన్లు’ అన్న చందంగా అక్రమాలు సాగుతున్నాయి. 

డాక్యుమెంట్‌ రైటర్లే మధ్యవర్తులు
అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఎవరైనా అంటే... అమ్మేవారు, కొనేవారు ముందకొచ్చి, తమకు, శాఖకు లాభం ఉంటే చాలు చార్మినార్‌నైనా రిజిస్ట్రేషన్‌ చేస్తామని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతుంటారు. అసలే మాయాజాలంతో సాగుతున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పలువురు.. ఉద్యోగుల వైఖరిని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన రిజిస్ట్రేషన్‌ పత్రం నకిలీదా, సరైనదా అనే విషయం పరిశీలించకుండా, తహసీల్దార్‌ కార్యాలయాన్ని సంప్రదించకుండానే కొందరు ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పొలం, స్థలం, భవనం ఇలా దేనినైనా రిజిస్ట్రేషన్‌ చేసే ముందు కొనే వ్యక్తి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ స్థలం అవతలి వ్యక్తిదేనా అన్నది విచారించాలి. కానీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఆలా జరగడం లేదు.

ఒక్కో పొలం, స్థలం, భవనం నాలుగైదు సార్లు హక్కుదారులకు తెలియకుండానే చేతులు మారుతున్నా సబ్‌ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్‌ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో రూ.లక్షలు చేతులు మారుతున్నాయని సమాచారం. డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో 2002లో అప్పటి వరకు ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్లను లైసెన్సు రెన్యూవల్‌ను నిలిపివేసింది. అయినా ఉమ్మడి జిల్లాలోని 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల చుట్టూరా యథేచ్ఛగా డాక్యుమెంట్‌ రైటర్ల అడ్డాలు ఉండడం.. వీరు చెప్పినట్లే అంతా నడుస్తుండడం గమనార్హం.

డాక్యుమెంట్‌ రైటర్లుగా రిటైర్డ్‌ సబ్‌రిజిస్ట్రార్లు
పారదర్శకంగా రిజిస్ట్రేషన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది పబ్లిక్‌ డేటా ఎంట్రీని అమల్లోకి తీసుకొచ్చింది. శాశ్వతమైన దస్తావేజులను స్వయంగా తయారు చేసుకునే వెసలుబాటు లభించింది. ఈ విధానంలో స్వయంగా ఇంట్లోనే దస్తావేజు తయారు చేసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు హాజరైతే సరిపోతుంది. కానీ దస్తావేజుదారులు తమ పని పోగొట్టుకోలేక సబ్‌ రిజిస్ట్రార్లతో ములాఖత్‌ అయి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం వచ్చే వారిని తమ వద్దకు పంపించేలా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో పబ్లిక్‌ డేటా ఎంట్రీ పక్కదారి పట్టి భూక్రయ విక్రయదారులు తిరిగి డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వరంగల్‌ ఆర్వో కేంద్రంగా కార్యాలయ ఎదుట, చుట్టుపక్కల 40 నుండి 60వరకు డాక్యుమెంట్‌ రైటర్ల కార్యాలయాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే, రిటైర్డ్‌ అయిన సబ్‌ రిజిస్ట్రార్లు పలువురు డాక్యుమెంట్‌ రైటర్లుగా అవతారం ఎత్తారంటే ఇందులో ‘లాభం’ ఎంత ఉందో ఇట్టే అవగతమవుతుంది.

మరిన్ని వార్తలు