టీఆర్‌ఎస్‌కు సాగునీరే ప్రచారాస్త్రం!

3 Apr, 2019 16:23 IST|Sakshi
బుద్దారంగండి నుంచి పెద్దమందడి బ్రాంచ్‌ కెనాల్‌కు పారుతున్న సాగునీరు (ఫైల్‌)

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి భారీ మెజార్టీని తెచ్చిపెట్టిన అంశం  

ఇదే అస్త్రంతో మరోమారు ముందుకు వెళ్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు 

సాక్షి, వనపర్తి: మూడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు రాల్చిన సాగునీటి, సంక్షేమపథకాల అస్త్రాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కూడా మరోమారు ఓట్లు రాల్చనున్నాయా.? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమి 3.86 లక్షల ఎకరాలుండగా ఖరీఫ్‌లో సుమారు 2.86 లక్షల ఎకరాల్లో, రబీలో సుమారు 95 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తారు. రబీలో వర్షాధారిత పంటలు వేరుశనగ, వరిమాత్రమే సాగు చేస్తారు.

జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన జూరాల, రాజీవ్‌ భీమా ఫేస్‌–2, కేఎల్‌ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందుతుంది. కాల్వల పనులు పూర్తి చేయటంతో పాటు సమీపంలోని చెరువులను, కుంటలను కృష్ణాజలాలతో నింపటంతో వనపర్తి జిల్లా సాగునీటి ఆయకట్టు గణనీయంగా పెరిగింది.

లక్ష ఎకరాలకు కృష్ణా జలాలు  
వనపర్తి జిల్లా పరిధిలోనే సుమారు లక్ష ఎకరాలకు జూరాల, భీమా, కేఎల్‌ఐ  ప్రాజెక్టులతో సాగునీరు అందిస్తున్నారు. అత్యధికంగా జూరాల ప్రాజెక్టు ఎడవ కెనాల్‌ నుంచి సుమారు 67 వేల ఎకరాలకు అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు, భీమా ఫేస్‌–2 కాల్వ ద్వారా వనపర్తి మండలం, పెద్దమందడి మండలంలో కొంత భాగం, పానగల్‌ మండలంలో కొన్ని గ్రామాల్లోని సుమారు 22 వేల ఎకరాలకు, కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా గోపాల్‌పేట, రేవల్లి మండలాలు పూర్తిగా పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపురం మండలాలు కొంత భాగాలకు మొత్తంగా సుమారుగా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. దశాబ్దాల కాలంగా బీడుగా మిగిలిన చెరువులు సైతం ప్రస్తుతం జలకళను సంతరించుకున్నాయి. తుమ్మలు మొలిచిన బీడు భూముల్లో  ప్రస్తుతం పచ్చని సిరుల పంటలు దర్శనమిస్తున్నాయి.

సీఎంఆర్‌ఎఫ్‌ ప్రభావమూ ఎక్కువే.. 
2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అత్యధికంగా సీఎం ఆర్థికసాయం మంజూరైన టాప్‌ త్రీలో జిల్లాలో వనపర్తి జిల్లా ఒకటి. అనారోగ్య సమస్యలతో సాయం కోరి వచ్చిన వారందరికీ మంత్రి నిరంజన్‌రెడ్డి సీఎం ఆర్థికసాయం మంజూరు చేయించారు. గడిచిన ఐదేళ్లలో సాయం పొందిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయని పార్టీ శ్రేణులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కొద్ది రోజులు మినహాయిస్తే మిగతా రోజుల్లో కనీసం రోజుకు ఒక్కటైన చెక్కు మంజూరవుతుంది.  

మరిన్ని వార్తలు