‘సీతారామ’ వేగం పెంచండి

23 Feb, 2020 10:55 IST|Sakshi

మొదటి ప్యాకేజీ పనులు మే నెలలో పూర్తవ్వాల్సిందే..

నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌

మార్చి 22న పంప్‌హౌస్‌ రెండు మోటార్లు డ్రై రన్‌ చేయాలి

అశ్వాపురం మండలంలో పనుల పరిశీలన

సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్‌సీ  మురళీధర్, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్‌ హెవీవాటర్‌ ప్లాంట్‌లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది.

అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్‌ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్‌ల ద్వారా కాంటెక్‌ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ పంప్‌హౌసులు, కెనాల్‌ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్‌ మొదటి ప్యాకేజీ పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

సీతారామ ప్రాజెక్ట్‌ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్‌హౌస్‌ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్‌ స్టేషన్‌కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు.

8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష
పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రజత్‌కుమార్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్‌కుమార్‌ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్‌ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్‌ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు ప్రిన్సిపల్‌ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్‌ ఎస్‌ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు.

మరిన్ని వార్తలు